ప్రజాశక్తి - రాయచోటి : జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం (సమగ్ర సర్వే) కార్యక్రమం వేగవంతం చేయాలని సిసిఎల్‌ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జెసిలను ఆదేశించారు. గురువారం విజయవాడలోని తన కార్యాలయం నుండి సంబందిత శాఖల కార్యదర్శులతో కలిసి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం (సమగ్ర సర్వే) కార్యాచరణ, అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్‌లు, జెసిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ గిరిష పిఎస్, డిప్యూటీ తహశీల్దార్ క్రాంతి కుమార్, రీసర్వే అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిసిఎల్‌ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిసాత్మకంగా నిర్వహిస్తున్న రీ సర్వే కార్యక్రమాన్ని సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలన్నారు. రీ సర్వేలో ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. సర్వే సిబ్బంది ఫీల్డ్‌కి వెళ్లి ఫీల్డ్ పిఒఎల్ ఆర్ పక్కగా పగడ్బందీగా చేపట్టాలన్నారు. గ్రౌండ్ ట్రుతింగ్ చేసే సమయంలో విఆర్‌ఒ తప్పనిసరిగా ఉండాలన్నారు. జిల్లాల వారీగా చుక్కల భూములకు సంబంధించి నివేదికలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. రీ సర్వే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా చేపట్టాలని ఇందుకు ఆర్డీవోలు, తహశీల్దార్లు రీసర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ గిరీష మాట్లడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రీసర్వే కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో సర్వే టీం సభ్యులు నిబంధనల ప్రకారం సర్వే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. భూ వివాదాలను పరిష్కరించడం అన్నది సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఆ దిశగా సమగ్ర సర్వేను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయడానికి అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలోని రీ సర్వేకు సంబంధించిన అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువులోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు.










