ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్ : వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకం క్రింద రీ సర్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ బసంత్ కుమార్ తెలిపారు. గురువారం విజయవాడ సిసిఎల్‌ఎ కార్యాలయం నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ తో పాటు, జాయింట్ కలెక్టర్ టిఎస్. చేతన్, ఇన్‌ఛార్జి ఆర్డీవో భాగ్యలక్ష్మి, ల్యాండ్ రికార్డ్స్ ఎడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో ఎంపిక చేసిన 26 గ్రామాల్లో 13వ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఏడు గ్రామాలకు సంబంధించి ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ప్రింటింగ్ కూడా వచ్చిందన్నారు. మిగిలిన గ్రామాల్లో కూడా ప్రింటింగ్ పక్రియ జరుగుతోందన్నారు. 24 గ్రామాలకు విలేజ్ మ్యాప్‌లు వచ్చాయన్నారు. గ్రౌండ్ టు థింగ్ వేగంగా చేపడతామన్నారు. జనవరి 15 లోపు పూర్తి చేసేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రీ సర్వేపై ఇప్పటికే జిల్లా మండల క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించామని చెప్పారు.










