ప్రజశక్తి - రాయచోటి : జిల్లాలో రీ సర్వే ప్రక్రియ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని కలెక్టర్ గిరీష పిఎస్ రాష్ట్ర భూ పరిపాలన కమిషనరు జి.సాయిప్రసాద్‌కు వివరించారు. గురువారం విజయవాడలోని సిసిఎల్‌ఎ కార్యాలయం నుంచి రాష్ట్రంలో జరుగుతున్న రీసర్వే ప్రగతిపై రాష్ట్ర భూ పరిపాలన కమిషనరు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా మొదటి దశలో రీ సర్వే పూర్తి చేసిన గ్రామాలలో వెబ్ ల్యాండ్ ప్రగతి, పాస్ పుస్తకాలు ప్రింటింగ్, హద్దురాళ్లు పాతడం, జిసిపి మార్కింగ్, చెకింగ్ పాయింట్స్ గుర్తింపు, డ్రోన్ ఫ్లయింగ్, గ్రౌండ్ ట్రూతింగ్ నోటీసుల పంపిణీ, సెక్షన్ (13)నోటిఫికేషన్ల ప్రగతి తదితర అంశాలలో కలెక్టర్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశ రీ సర్వే పూర్తి చేసిన గ్రామాలలో హద్దురాళ్లు పాతడం, ఖాతాలకు ఫొటో మ్యాపింగ్ తదితర ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయడానికి కషి చేస్తున్నామన్నారు. రీ సర్వే పూర్తయిన మండలాలకు ఇప్పటికే రోవర్లను పంపామని చెప్పారు. వాటి ద్వారా హద్దురాళ్లు పాతే ప్రక్రియను తహశీల్దార్లు, సర్వే శాఖ సిబ్బందితో రోజూ సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. రీ సర్వేకు సంబంధించి ఆయా ప్రక్రియల పనులను కూడా లక్ష్యం మేరకు నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేయడానికి కషి చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఒ సత్యనారాయణ, కలెక్టరేట్ ఎఒ బాలకష్ణ, సర్వే శాఖ సిబ్బంది పాల్గొన్నారు.










