Jun 24,2023 22:23

వీడియో కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు

     పుట్టపర్తి అర్బన్‌ : రీ సర్వేలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా||కెఎస్‌.జవహర్‌ రెడ్డి కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు వివరించారు. విజయవాడ సిఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి శనివారం నాడు జగనన్న భూహక్కు, రీసర్వే, ప్రయారిటీ భవనాలు, జగనున్నకు చెబుదాం తదితర అంశాలపై కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌ స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి ఈ సమీక్షలో కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌, డిఆర్‌ఒ కొండయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద జిల్లాలో రీసర్వే చేపట్టిన గ్రామాల్లో వేగవంతంగా పనులు చేపడుతున్నామన్నారు. రీ సర్వే చేపట్టిన కొన్ని గ్రామాల్లో 10, 12 వేల ఎకరాల వరకు భూములు ఉన్నాయని, కర్ణాటక రాష్ట్రానికి అనుకుని ఉన్న గ్రామాల్లో రైతులు వలసలు వెళ్లడంతో వారిని తిరిగి పిలిపించి హద్దులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆయా గ్రామాల్లో లక్ష్యానికి అనుగుణంగా రీసర్వే ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ రామకష్ణ, పిఆర్‌ ఎస్‌ఇ గోపాల్‌ రెడ్డి, డిఎంహెచ్‌ఒ డా||కృష్ణారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.