రాయచోటి: ప్రజల ప్రాణ భద్రత మనందరి సామాజిక బాధ్యతని, ఆ దిశగా జిల్లాలో రహదారుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని జెసి ఛాంబర్‌లో రోడ్డు భద్రతా కమిటీతో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన భద్రతా చర్యలను వివిధ శాఖాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటంతో పాటు క్షతగాత్రులు, మత్యువాత పడుతుండడం బాధాకరమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలతో పాటు ప్రతిఒక్కరూ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా నివారించగగిలిన వారమవుతమన్నారు. రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణాలు అధికంగా మలుపులు ఉండడం, ప్రమాద హెచ్చరికలు, స్పీడ్ నియంత్రిక సూచికలు, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, యూటర్న్ మలుపులు కనిపించక పోవడం, డ్రైవర్ల తప్పిదాలు, మద్యం సేవించి నడపడం, హెల్మెట్ పెట్టుకోక పోవడంతోనే జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత కమిటీలోని ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో క షి చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబందనలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదాల బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, స్టడ్స్, కల్వర్టులు, అండర్ పాస్‌ల వద్ద రేడియం స్టిక్కర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు, రవాణాశాఖ పక్కా ప్రణాళికతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు జరిగే స్థలాన్ని గుర్తించి అక్కడ కనీస భద్రత చర్యలు చేపట్టలన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. 53 మందికి గాయాలు అయ్యాయన్నారు. ఇకమీదట రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చేపట్టవలసిన చర్యలపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు. సమీక్షలో డిస్ట్రిక్ ట్రాన్స్‌పోర్ట్ అధికారిణి శాంతకుమారి, అదనపు ఎస్పీ డాక్టర్ రాజ్ కమల్, రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి, ఆర్టీసీ, అర్‌అండ్‌బి, జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులు, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖాధికారులు పాల్గొన్నారు.










