రహదారి భద్రతపై అవగాహనా ర్యాలీ
ప్రజాశక్తి-కావలి : రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహనా ర్యాలీ శుక్రవారం ఎం.ఎల్.ఎ. రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఆర్‌డిఒ శీనానాయక్, డిఎస్‌పి వెంకటరమణ, ఆర్‌టిసి డిఎం శ్రీనివాసులు హాజరయ్యారు. వేగం కన్నా ప్రాణం మిన్న అన్న సూక్తిని ప్రతి నిమిషం గుర్తుంచుకుని వాహనాలను నడపాలని ఎంఎల్‌ఎ పిలుపునిచ్చారు. శుక్రవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహనా ర్యాలీ నిర్వహించారు. కావలి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సుందరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు, ఆటో, టాక్సీ, ఆర్‌టిసి కార్మికులు, ఆటోమొబైల్ షోరూం యజమానులు పాల్గొన్నారు. ఐదులాంతర్ల సెంటర్ నుండి ఆర్‌డిఒ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీ ప్రారంభించిన శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. యువకులు ద్విచక్ర వాహనాలను నడిపే సమయంలో తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను గమనంలో ఉంచుకోవాలన్నారు. ఆర్‌డిఒ శీనానాయక్, డిఎస్‌పి వెంకటరమణ, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసకిరణ్, ప్రయివేట్ విద్యా సంస్థల సంఘం నాయకులు కాంతారావు, వెంకటేశ్వరరెడ్డి, తదితరులు మాట్లాడారు.
నేడు డ్రైవర్లకు వైద్య శిబిరం
పట్టణంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ భవనంలో శనివారం మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సుందరరావు తెలిపారు. ఈ శిబిరంలో ఉచితంగా బిపి, షుగర్, రక్తపరీక్షలు చేస్తారని, గుండెపోటు, మానసిక సమస్యలపై అవగాహన కల్పిస్తారన్నారు. ర్యాలీని విజయవంతం చేసిన వివిధ శాఖల వారికి కృతజ్ఞతలు తెలిపారు.










