Jul 12,2021 17:13

న్యూఢిల్లీ : నరసాపురం వైసిపి రెబల్‌ ఎంపి రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసిపి ఎంపిలు కోరుతుండడం పట్ల లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పందించారు. వైసిపి దాఖలు చేసిన రఘురామ అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేందుకు ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. నిర్ణయం తీసుకునే ముందు ఇరుపక్షాలతో చర్చిస్తామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించాకే తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. పిటిషన్‌ పరిశీలన తర్వాత సభాహక్కుల కమిటీకి పంపిస్తామని వివరించారు. సభలో నిరసన తెలిపేందుకు ఎవరికైనా హక్కు ఉంటుందని, అయితే, సభలో ఏదైనా అంశం ప్రస్తావనకు కొన్ని నిబంధనలు పాటించాలని అన్నారు. రఘురామ అనర్హత పిటిషన్‌పై ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయలేమని, పిటిషన్‌ పరిశీలన ప్రక్రియకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు.