Feb 07,2023 21:05

మాట్లాడుతున్న కమిషనర్‌ హరిత

మాట్లాడుతున్న కమిషనర్‌ హరిత
రెవెన్యూ వసూళ్ల లక్ష్యాలను పూర్తి చేయండి

నెల్లూరు:నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్థి, కుళాయి, డ్రైను, ఖాళీ స్థలాల పన్నుల వసూళ్లకై రెవెన్యూశాఖకు నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని కమిషనర్‌ హరిత రెవెన్యూ అధికారులకు సూచించారు. నగర పాలక సంస్థ రెవెన్యూ శాఖ అధికారులతో కమిషనర్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రెవెన్యూ అధికారులు పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలని, ఇప్పటికీ డిమాండ్‌ నోటీసులు జారీ చేయని కమర్షియల్‌ భవనాలను గుర్తించి, వారికి తుది నోటీసు జారీ చేసి, పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయ భవనాలకు పన్ను నోటీసులు జారీ చేసి వసూళ్లు చేయాలని సూచించారు. మొండి బకాయిదారులను గుర్తించి వారికి సంబంధించిన ఆస్థులను జప్తు చేయాలని, కుళాయి, డ్రైను కనెక్షన్లను తొలగించాలని ఆదేశించారు. నగర పాలక సంస్థ అద్దె షాపుల బకాయిలను పూర్తిగా వసూలు చేయాలని, బాకీ చెల్లించని వారిని షాపుల నుంచి వెంటనే ఖాళీ చేయించాలని సూచించారు.
షాపుల అద్దెను క్రమం తప్పకుండా ప్రతీ నెలా వసూలు చేయాలని అధికారులను కమిషనర్‌ ఆదేశించారు. నగర పాలక సంస్థ అద్దె షాపుల కేటాయింపులను ఆన్లైన్‌ లో అప్డేట్‌ చేసి వివరాలను ఎప్పటికప్పుడు పారదర్శకంగా ఉంచాలని, ఖాళీగా ఉన్న షాపులను గుర్తించి వెంటనే వేలము నిర్వహించి అద్దెకు ఇవ్వాలన్నారు. నగర వ్యాప్తంగా ప్రతీ భవనాన్ని పన్ను పరిధిలోకి తీసుకొచ్చి, డిమాండ్‌ నోటీసులు జారీ చేయాలని కమిషనర్‌ ఆదేశించారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పారిశుధ్య నిర్వహణ పనుల యూజర్‌ చార్జీల వసూళ్ళపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. పన్ను వసూళ్ళలో సచివాలయ అడ్మిన్‌ కార్యదర్శులకు వారాంతపు లక్ష్యాలను నిర్దేశించి ఫోటోలను గ్రూపులో అప్లోడ్‌ చేయాలన్నారు. రెవెన్యూ అధికారులంతా కార్పొరేషన్‌ ఆదాయం పెంచేందుకు కషి చేయాలని కమిషనర్‌ సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ చెన్నుడు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.