రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రజలు తెలిపిన ప్రతి రెవెన్యూ సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలోని ఎంజిఆర్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాధ్, ఆర్‌డిఒ ఎస్.కరుణకుమారిలతో కలసి ప్రతి మండలానికి సంబంధించి రెవెన్యూ సమస్యలపై ఆయన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సమస్యల కోసం నిర్వహిస్తున్న సర్వేలో అధికభాగం ప్రజలు రెవెన్యూ సమస్యలపైనే తమ దృష్టికి తీసుకొస్తున్నారన్నారు. ఇందుకోసం అన్ని మండలాల స్థాయి అధికారులతో ఒక వేదికగా ఈ సమీక్ష నిర్వహించి సమస్యలపై జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలోనే ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో తెలియజేసేలా ప్రజలకు తెలుపుతున్నామన్నారు. రైతులు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చుక్కల భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇటీవల ఇఒ నెంబర్ 163ను విడుదల చేసిందని తెలిపారు. తద్వారా నెల్లూరు జిల్లాలో 47 వేల ఎకరాలు, ఆత్మకూరు నియోజకవర్గంలో 17 వేల ఎకరాల్లో చుక్కల భూముల బాధిత రైతుల సమస్యలకు పరిష్కారం లభింఛిందని పేర్కొన్నారు. తొలుత మండలాల వారీగా నిర్వహించిన సమీక్షలో సంగం మండలం జంగాలకండ్రిక, సిద్దీపురం, సంగం గ్రామాల నుండి పలువురు నాయకులు సమస్యలను విన్నవించగా ఎంఎల్‌ఎ వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆర్‌డిఒను కోరారు. వెంటనే స్పందించిన ఆర్‌డిఒ తహశీల్దార్లకు పలు సూచనలు అందజేశారు. చేజర్ల మండలంలో పలువురు రైతులు సాదాబైనామా, ఆక్రమణల విషయమై ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం గ్రామ ముస్లీం మైనారిటీలకు శ్మశానానికి అర ఎకరా భూమిని అందించాలని వైసిపి నాయకుడు పెమ్మసాని శ్రీనివాసులునాయుడు తెలియజేయడంతో వెంటనే సర్వే చేసి వారికి భూమిని కేటాయించేలా చూడాలని అధికారులను కోరారు. రెవెన్యూ సమస్యల పరిష్కారమయ్యేంత వరకు ప్రతినెలా సమీక్ష సమావేశాలు నిర్వహించి అర్జీల పరిష్కారంపై కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గోపారం వెంకటరమణమ్మ, మున్సిపల్ ఏఈ ప్రసాద్, వైసిపి పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, మాజీ జెడ్‌పిటిసి డాక్టర్ సిహెచ్ ఆదిశేషయ్య, ఎంపిపి కేతా వేణుగోపాల్ రెడ్డి, నోటి వినరుకుమార్ రెడ్డి, తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.










