దసరా పండుగ వస్తున్నది. అయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆర్.టి.సి. బస్సులు నేటికీ ప్రారంభం కాలేదు. అన్‌లాక్‌డౌన్ 5.0 అమలవుతున్నది. డిజాస్టర్ మేనేజిమెంట్ యాక్ట్ కింద దేశవ్యాప్తంగా లాక్‌డౌన్, అన్‌లాక్ లను కేంద్రమే నిర్దేశిస్తున్నది. అన్‌లాక్ 4.0లో అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు అనుమతించింది. ఎ.పి కి ఒడిషా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల బస్సులు ఎలాంటి వివాదాలు లేకుండా పునరుద్ధరించబడ్డాయి. తెలంగాణకి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల బస్సులతో ఎలాంటి వివాదం లేదు. సమస్య అంతా ఏ.పి, తెలంగాణ మధ్యనే ఉంది. కారణం ఏమిటి? ఇవి నేడు ఉభయ రాష్ట్రాల ప్రయాణికులను వేధిస్తున్న ప్రశ్నలు.
ఈ రెండు రాష్ట్రాల మధ్య నడిచే బస్సులు అధిక ఆదాయం వచ్చే రూట్లు. మిగతా రూట్లలో ఆదాయం కంటే ఖర్చులు అధికం. కానీ ఈ (వివాదపు) రూట్లలో ఖర్చు కంటే ఆదాయమే కొద్దో గొప్పో ఎక్కువ. అందుకే ఈ రెండు ఆర్.టి.సి.లు కిందో మీదో పడి మొత్తం రూట్లలో బస్సులు నడపగలుగుతున్నాయి. అధిక ఆదాయం వచ్చే రూట్లలో బస్సులు నడవక పోవడంతో ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి ఆర్.టి.సి.ల మనుగడకే ప్రమాదం పెరిగింది. ఈ రెండు ఆర్.టి.సి.ల వివాదం ప్రైవేట్ ఆపరేటర్లకు అంది వచ్చిన వరమైంది. దీన్ని అదునుగా తీసికొని సాధారణ చార్జీలకన్నా 4-5 రెట్లు అధిక చార్జీలతో ప్రయాణికులను దోచుకుంటున్నారు. రెండు ఆర్.టి.సి.ల లోని కార్మిక సంఘాలు వివాదానికి తెర దించి బస్సులు నడపాలని కోరుతున్నాయి. ఇవన్నీ చెవిటివాని ముందు శంఖం ఊదిన చందంగా తయారైనాయి.
ఇంతకీ వివాదం ఏమిటి?
రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసుల నిబంధనలకు అనుగుణంగా రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరగాలని, తదనుగుణంగానే రెండు ఆర్.టి.సి.లు బస్సులు నడపాలని చెబుతున్నామని, కానీ అందుకు భిన్నంగా ఏ.పి. అదనంగా బస్సులు, కిలోమీటర్లు నడుపుతున్నదని తెలంగాణ ఆర్.టి.సి ఫిర్యాదు. అదే నిజమైతే ఈ ఆరు సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నారు? రెండు ఆర్.టి.సి.ల ఉన్నతాది óకారులు అందరూ...అంతర్ రాష్ట్ర బస్సు సర్వీస్ నిబంధనలు కాచి ఒడిగట్టిన హేమాహేమీలే కదా? ఈ వివాదం ఎందుకు పరిష్కరించుకోలేదు? లాక్‌డౌన్ సడలింపులు వచ్చి...ప్రైవేట్ బస్సులకు అనుమతులు ఇచ్చి...వారు ప్రజలను దోచుకుంటుంటే వివాదాలతో చోద్యం చూడటం వెనుక ఆంతర్యం ఏమిటి?
అసలు కిటుకంతా ఇక్కడే ఉంది
లాక్‌డౌన్ కాలంలో ఆదాయాలు కోల్పోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానులు వాటన్నింటిని ఇప్పుడు సంపాదించుకోవడానికే అనే విమర్శ బలంగా ఉంది. ఆర్.టి.సి లను దివాళా తీయించి మొత్తం ఆర్.టి.సి. ల మనుగడ లేకుండా చేసేందుకు కాచుకు కూర్చున్న ప్రభుత్వాలకు కరోనా అనుకోని వరమైందనే విమర్శ కూడా ఉంది. తెలంగాణ, ఏ.పి మధ్య నేటి వివాదం, బస్సులను మూలన పెట్టడం చూస్తే పై రెండు విమర్శలలో వున్న వాస్తవికత బోధపడుతుంది.
ప్రజల ఓట్లతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల బాధ్యత ఏమిటి? రెండు రాష్ట్రాల ఆర్.టి.సి. అధికారులు విశేష అనుభవం ఉండి కూడా పరిష్కరించుకోనప్పుడు ప్రభుత్వాలే స్వయంగా రంగంలోకి దిగి సమస్య పరిష్కరించవచ్చు. రెండు రాష్ట్రాల రవాణా శాఖామాత్యులు సమావేశం కావాలని నిర్ణయించిన కొద్దిసేపట్లోనే రద్దు చేసుకున్నారు. చర్చలు అధికారుల స్థాయికి పరిమితం చేయాలి తప్ప మీరు జోక్యం చేసికోవద్దని తీలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినందునే సమావేశం రద్దు అయిందని ప్రచారం జరుగుతున్నది. ఇది నిజమా కాదా అన్నది పక్కన పెట్టి ప్రభుత్వాలు జోక్యం చేసుకోలేదనేది యదార్ధం. 2014 తర్వాత గతం కంటే తెలంగాణ పరిధిలో బస్సులు, కిలోమీటర్లు తగ్గించుకున్నామని, తెలంగాణ కూడా పెంచుకున్నదని, ఇంకా ఎ.పి తో సమానంగా పెంచుకోవచ్చని చెప్పామని ఎ.పి.ఎస్.ఆర్.టి.సి అధికారులు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది నిజమో రెండు ప్రభుత్వాలు తేల్చాలి. అవసరమైతే దేశం లోని ఆర్.టి.సి.లను అన్నింటికీ కేంద్ర స్థాయి లోని సంస్థ అయిన ఎ.ఎస్.ఆర్.టి.యు కి అప్పగించి వారి నిర్ణయం ఇరు రాష్ట్రాలకు శిరోధార్యమని రెండు ప్రభుత్వాలు నిర్ణయించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి గతంలో రవాణా శాఖామాత్యులుగా పనిచేసిన అనుభవం ఉంది. దానిని ఈ పరిస్థితులలో ఉపయోగించవచ్చు. ఇలావుండగా, రెండు ప్రభుత్వాలు ప్రయివేటు ఆపరేటర్ల చేతిలో కీలు బొమ్మలై ఆర్.టి.సి.ల పీక నులిపేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.
అధికారం అప్పగించిన
ప్రజల నెత్తినే చేతులు పెడతారా?
కరోనా కాలంలో ఆదాయాలు లేక, ఉపాధులు పోయి ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలి నాలి చేసుకునే వారు, అసంఘటిత రంగ కార్మికులు. వీరు దుర్భర పరిస్థితులలో కరోనాతో కాదు ఆకలితో అలమటించి చనిపోయే రోజులొస్తాయని అనేకమంది మేధావులు గగ్గోలు పెడుతున్నారు. ఈ కాలంలో భవన నిర్మాణ రంగం అత్యంత ఘోరంగా దెబ్బతిన్నది. ఏ.పి నుండి భవన నిర్మాణ కార్మికులు తెలంగాణ లోని వివిధ ప్రాంతాలలో అత్యధికంగా హైద్రాబాద్‌లో ఉంటా రు. రెండు ఆర్.టి.సి.ల వివాదం కారణంగా వారు బలిపశువులు అవుతున్నారు. దీనికి ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యమే కారణం అవుతుంది.
పరిష్కారం ఏమిటి?
రెండు రాష్టాల ఆర్.టి.సి.ల కార్మికులు సమైక్యంగా రంగం లోకి దిగాలి. ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు రాజకీయ పార్టీలు రెండు ప్రభుత్వాలను నిలదీయాలి. 17వ తేదీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యే లోపు ఆర్.టి.సి. సర్వీసులు నడుపుతారా, లేదంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి వస్తుందని చెప్పి అందుకు సన్నద్ధం కావాలి. ఇలాంటి ఒత్తిడి ప్రభుత్వాలను సరైన దారిలోకి తీసుకొస్తుందని, ఆ దిశగా అడుగులు పడతాయని ఆశిస్తున్నాం.
(వ్యాసకర్త ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్
ఉప ప్రధాన కార్యదర్శి)










