Jan 12,2023 22:38

అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎంఎల్‌ఎ ,రూప్‌కుమార్‌ యాదవ్‌

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :నెల్లూరునగర వైసిపిలో విబేధాలు ముదిరి పాకాన పడ్డాయి. ఒకప్పుడు కలిసి మెలిసి తిరిగిన ఎంఎల్‌ఎ అనిల్‌కుమార్‌ యాదవ్‌, డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ మధ్య వివాదం ముదిరింది. వైసిపి రెండు గ్రూపులుగా చీలిపోయింది. నేతలు, కార్యకర్తలు, కార్పొరేటర్లు చెరో గ్రూపులో చేరారు. ఎక్కడ చిన్న వివాదం జరిగినా మీ తప్పంటే మీతప్పంటూ బయటపడుతున్నారు. నగరంలోని రెవెన్యూ, పోలీసు, కార్పొరేషన్‌ అధికారులు ఇద్దరి నేతల మధ్య తలలు పట్టుకుంటున్నారు. ఇక నాయకులు, కార్యకర్తల పరిస్థితి చెప్పనవసరం లేదు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో నెల్లూరు నగరంలో ఈ వివాదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది..

నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలో గత రెండు ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌, నగరంలో వైసిపి విజయకేతనం ఎగురవేసింది. జగన్‌ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో నేతలంతా కలిసి పనిచేయడంతో పార్టీ విజయం సులువయ్యింది. ప్రతిపక్షాల బలహీనతలు, వైసిపి నేతల బలంతో ఇది సాధ్యమైంది. నెల్లూరు రూరల్‌లోనూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం కుటుంబాల మధ్య విబేధాలున్నప్పటికి అప్పుడప్పుడు బయటకొస్తున్నారు. నెల్లూరునగరంలో గతంలో ఎంఎల్‌ఎ అనిల్‌కుమార్‌యాదవ్‌ యువకుడిగా, అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రజలు ఆదరించారు. ఇదే సమయంలో ఆయన బాబారు రూప్‌కుమార్‌యాదవ్‌ వెనుక నుంచి రాజకీయాలు నడిపారు. ఎన్నికలు నిర్వహించడంలోనూ, నేతలను నడిపించడంలోనూ కీలకంగా ఉన్నారు. ఎంఎల్‌ఎగా, మంత్రి ఉన్న సమయంలో నెల్లూరునగరంలో రూప్‌కుమార్‌యాదవ్‌ మొత్తం వ్యవహారం నడిపించారు. అధికారులతో కార్యక్రమాలు సైతం అయనే నడిపించారు. అనిల్‌కుమార్‌యాదవ్‌కు మంత్రి పదవి పోయిన వెంటనే ఆయనపై ఆపార్టీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గతంలో ఎప్పటి నుంచో ఉన్న విబేధాలు ఒక్కసారిగా బయటకొచ్చాయి. నూడా ఛైర్మన్‌, ఆర్యవైశ్య నాయకులు ముక్కాల ద్వారకానాధ్‌ నగరంలో ఆయనతో కలిసి ఉన్నారు.మంత్రిపదవి పోయిన వెంటనే ఆయన అనిల్‌ నుంచి దూరమయ్యారు. ప్రస్తుతం అనిల్‌ను పక్కన పెట్టి ఇతర నేతలను కలుపుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాబారు రూప్‌కుమార్‌ యాదవ్‌, అబ్బారు అనిల్‌కుమార్‌ యాదవ్‌ మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమంటోంది. డిప్యూటీ మేయర్‌ , నుడా ఛైర్మన్‌ ఇద్దరు వేరుకుంపటి పెట్టారు. అనిల్‌కుమార్‌కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరునగరంలో అనిల్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైసిపి అధిష్టానం ఎంఎల్‌ఎనే నియోజకవర్గానికి బాస్‌ అంటూ తీర్మానించింది. ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిదిలోని రెవెన్యూ, పోలీసు, ఇతర అధికారులు వీరి మధ్య విబేధాలతో తలలు పట్టుకుంటున్నారు. ఒకరు పనిచేయమంటే, మరొకరు ఆ పని చేయొద్దని చెబుతున్నారు. ఇక నగరంలో నేతలు, కార్యకర్తలు, ఇద్దరి నేతల మధ్య నలిగిపోతున్నారు. ఎవరితో ఉంటే ఎవరికి కోపమో అంటూ భయం భయంగా ఉంటున్నారు. నగరంలోని విబేధాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. వీరిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం మానేసి, మౌనంగా ఉంటూ వస్తుంది. ఇప్పుడు వివాదం ముదరడంతో సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
నగరంలో భయం..భయంగా..!
నెల్లూరు నగరంలో అనిల్‌కుమార్‌, రూప్‌కుమార్‌ యాదవ్‌ విబేధాలతో నగరంలో ఆపార్టీనేతలు, కార్యకర్తలు వణికిపోతున్నారు. ఇటీవల గాంధీబొమ్మ వద్ద రూప్‌కుమార్‌కు చెందిన వ్యక్తి దుకాణం వద్ద కార్పొరేషన్‌ అధికారులు మొట్లు తొలగించడంతో పెద్ద ఎత్తున వివాదం జరిగింది. రెండో నగర పోలీసు స్టేషన్‌ పరిధిలో రూప్‌కుమార్‌కు చెందిన వ్యక్తులను అరెస్ట్‌ చేయడంతో ఆయన నేరుగా స్టేషన్‌కు వెళ్లి వారిని బయటకు తీసుకెళ్లారు. ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో రూప్‌కుమార్‌ యాదవ్‌ సొంత పార్టీ భవనాన్ని ప్రారంభించారు. అనిల్‌కుమార్‌ గడప గడపకు కార్యక్రమంలో ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు పదవి పోతుందని మోసం చేశారని, ఇబ్బందులు పెడుతున్నారని, తనకు టైమ్‌ వచ్చినప్పుడు బలంగా కొడతామని హెచ్చరించారు. బుధవారం రాత్రి మూలాపేటలో కార్పొరేటర్‌ ఇంటిపై అనిల్‌కుమార్‌యాదవ్‌ అనుచరులు దాడిచేసి ధ్వంసం చేశారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో ఆపార్టీ నేతలు తిరుగుతున్నారు. ఆపార్టీ అధిష్టానం దృష్టిపెట్టకపోతే తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆపార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.