ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : అంతర్గత ప్రజాస్వామ్యం పట్ల సిపిఐ(ఎం) నిబద్ధతను చాటి చెప్పేలా మహాసభలో చర్చలు సాగుతున్నాయి. పార్టీ ముసాయిదా రాజకీయ తీర్మానంపై రెండవ రోజు గురువారం లోతైన చర్చ జరిగింది. ముసాయిదా నివేదికకు పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన సవరణలను కేంద్ర కమిటీ స్క్రీన్ చేసి 4,001 సవరణలను ముసాయిదా తోపాటు మహసభ ముందుంచింది. వీటిపై రెండో రోజు చర్చలో 31మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సిపిఎం 23వ అఖిల భారత మహాసభలో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రవేశపెట్టిన రాజకీయ ముసాయిదాపై చర్చ ప్రారంభమైంది. గురువారం సాయంత్రానికి వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 31 మంది ప్రతినిధులు చర్చలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ముదిరెడ్డి సుధాకరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి వి కృష్ణయ్య, వి రాంభూపాల్ పాల్గొన్నారు. అలాగే కేరళ నుంచి పి రాజీవ్, పశ్చిమ బెంగాల్ నుంచి శ్రీజన్ భట్టాచార్య, తమిళనాడు నుంచి బద్రి, మహారాష్ట్ర నుంచి ఉదరు నార్కర్, త్రిపుర నుంచి హరిపడ దాస్, బీహార్ నుంచి లాలన్ చౌదరి, జార్ఖండ్ నుంచి ప్రకాష్ విప్లవ్, ఒడిషా నుంచి జనార్దన్ పతి, అస్మాన్‌నుంచి ఇస్ఫఖర్ రహ్మాన్, రాజస్థాన్ నుంచి ధులీ చంద్, కర్ణాటక నుంచి బాలకృష్ణ షెట్టి చర్చల్లో పాల్గొన్నారు. ఉదయం సెషన్‌లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దుర్మార్గంగా పెంచుకుంటూపోతున్న పెట్రో ధరలకు వ్యతిరేకంగా పెద్దయెత్తున నిరసనలకు పిలుపునిస్తూ మహాసభ ఒక తీర్మానం ఆమోదించింది.











