Feb 15,2023 21:41

మాట్లాడుతున్న సీఎం జగన్

కడప ప్రతినిధి/ జమ్మలమడుగు రూరల్‌
రాబోయే రెండేళ్లల్లో జిల్లా వాసుల ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కల సాకారం అవుతుందని ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం 11.10 గంటల సమయంలో కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో రూ.3,300 కోట్లతో మొదటిదశ ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులను జెఎస్‌డబ్ల్యు గ్రూప్‌ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌తో కలిసి చేసిన భూమిపూజ కార్యక్రమంలో ప్రసం గించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి దశ నిర్మాణ పనుల్ని 24 నెలల్లో పూర్తి చేస్తామని, రూ.5000 కోట్లతో రెండవ దశ పనుల్ని ఐదేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. కర్నాటక రాష్ట్రంలోని విజయనగర తరహాలో కడప జిల్లా మహా నగరంగా రూపాంతరం చెందుతుందని ధీమాను వ్యక్తం చేశారు. దేశంలోనే జెఎస్‌డబ్య్లు గ్రూప్‌ 1.70 లక్షల కోట్ల పెట్టుబడులతో 28 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో అగ్రగామిగా నిలిచిందని, ఇటువంటి కంపెనీ చేతిలో కడప జిల్లాలోని ఉక్కు పరిశ్రమను పెట్టామని చెప్పారు. కీ.శే వైఎస్‌ఆర్‌ తన హయాంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి జిల్లా రూపురేఖలు మార్చాలని కలలు గన్నా రని, ఆయన మరణానంతరం అధికారంలోకి వచ్చిన పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఆయన బిడ్డ ముఖ్యమంత్రి కావడంతో ఒక్కొక్కటిగా మంచిరోజులు వస్తున్నాయన్నారు. రూ.700 కోట్లతో స్టీల్‌ ప్లాంట్‌తోపాటు, ఆగ్జిలరీ, ఎకోసిస్టమ్‌, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల కల్పిస్తామన్నారు. 67వ జాతీయ రహదారి 7.5 కి.మీ మేర నాలుగు వరుసల రహదారి అనుసంధానం, ప్రొద్దుటూరు-యర్రగుంట్ల 10 కి.మీ మేర రైల్వేలైన్‌, గండి కోట జలాశయం నుంచి నీటి సరఫరా, తలమంచిపట్నం నుంచి 22కెవి విద్యుత్‌ సదుపాయం కల్పించాల్సి ఉందన్నారు. దీంతోపాటు కొప్పర్తి పారి శ్రామికవాడలో ఇఎంసిలో 550 ఎకరాల్లో 10 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రానున్నాయన్నారు. ఫలితంగా లక్ష మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. జగనన్న ఇండిస్టియల్‌ హబ్‌లో రూ.1100 కోట్ల పెట్టుబడులతో 11,500 మందికి ఉపాధి అవకాశాలు అందుబాటు లోకి వస్తాయని చెప్పారు. ఇందుకుగానూ 155 ఎకరాల్లో హబ్‌ అడుగులు వేస్తోం దన్నారు. ఫలితంగా 18 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తత్ఫలితంగా 1.75 లక్షల ఉపాధి అవకాశాలు వస్తాయని తెలి పారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కోసం విదే శాలు, ఇతర ప్రాం తాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పి స్తామన్నారు. ఇందుకు సంబంధించి 75 శాతం స్థాని కులకు ఉద్యోగాల కల్పనకు సంబంధించి చట్టాన్ని తెచ్చామని గుర్తు చేశారు. అనంతరం జిందాల్‌ గురించి ప్రస్తావిస్తూ ఇక్కడికి మీరొక్కరే వచ్చారని కాదు, గ్రీన్‌ హైడ్రోజన్‌, సోలార్‌ప్లాంట్‌, ఇతర ఆగ్జిలరీ యూనిట్ల ఏర్పాటును దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామని తెలిపారు. మీకేమైనా సమస్యలు ఎదురైతే ఒక్క ఫోన్‌ కాల్‌ చేయాలని, అండగా నిలుస్తామని హామీనిచ్చారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌, పారిశ్రామిక ర్యాంకింగ్‌లోనూ ముం దంజలో ఉన్నాయని తెలిపారు. 2021 -22లో 11.43 శాతం జిడిపితో దేశంలోనే అగ్రగామిగా నిలిచామన్నా రు. అనంతరం పులివెందుల ఫంక్షన్‌ అనంతరం విజయ వాడకు వెళ్లి పోయారు. అంతకుముందు పరిశ్రమలశాఖా మంత్రి గుడివాడ అమర్నాధ్‌ మాట్లాడుతూ కోవిడ్‌ మహమ్మారి విజృంభణ కారణంగా 2019 నుంచి ప్రపంచమంతా స్తంభించిపోవడంతో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయ డంలో ఆలస్యమైందన్నారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే వెనుకబడిన రాయల సీమకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో కీ.శే వైఎస్‌ఆర్‌ శ్రీకారం చుట్టారని, ఆయన మరణానంతరం అసం పూర్తిగా నిలిచి పోయిం దని చెప్పారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లా డుతూ ముఖ్యమంత్రి వైఎష్‌ జగన్‌కు పులివెందుల తర్వాత జమ్మల మడుగు చిరునామాగా మారడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాను పరిశ్రమల ఖిల్లాగా మార్చుతున్నారని తెలిపారు. కార్యక్ర మంలో డిప్యూటీ సిఎం అం జా ద్‌బాషా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ ఆకే పాటి అమరనాధరెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు, పరి శ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్‌ పాల్గొన్నారు.
నిర్వాసితులను అడ్డుకున్న పోలీసులు
సున్నపురాళ్లపలె,్ల పెద్ద దండ్లూరు గ్రామాలకు చెందిన భూ నిర్వాసితులు సిఎం నిర్వహించిన భూమి పూజ ప్రాంతానికి వచ్చేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకో వడంతో వెనుదిరిగారు. ప్రహరీ మధ్య భూమి పూజ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని బాధితులు వాపోయారు. దాదాపు 100 మందికి రూ. 3.75 లక్షలు రావాల్సి ఉందని, తమకు న్యాయం చేయాలని కోరారు.