Apr 09,2022 07:03
  • పలువురు సీనియర్లలో అసంతృప్తులు
  • జిల్లాల్లో గౌరవం లేని పదవులనే భావన
  • క్యాబినెట్‌ కూర్పుపై సజ్జల, సిఎం మధ్య సుదీర్ఘ చర్చలు
  • నేడు ఖరారయ్యే అవకాశం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంత్రి పదవి చేపట్టినా పూర్తిస్థాయి అవగాహన కలిగేటప్పటికే ఎనిమిది నెలల నుండి ఏడాదిపాటు పడుతుందని, ఈలోపు ఎన్నికల వాతావరణం వస్తుందని చేసేదేమీ ఉండదనే భావన వారిలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రకాశం, విజయనగరం నుండి పలువురు ఎమ్మెల్యేలు తమకు పదవులు వద్దని ప్రకటించారు. రానున్నకాలంలో పార్టీ నాయకత్వానికి కీలకపాత్రని, జిల్లా అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేస్తామని సిఎం ప్రకటించడంతో ఇక వాటి ద్వారానే కార్యక్రమాలు జరుగుతాయని మంత్రులకు ఏమి ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. మూడేళ్లకు పైగా పాతమంత్రులను కొనసాగించడంతో చివరి రెండేళ్లలో మంత్రి పదవి వచ్చినా ఏమిచేయగలమనే సంశయాన్ని సీనియర్‌ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల పదవీకాలంలో తమకు కేటాయించిన శాఖపై అవగాహనకే ఆరునెలలు సమయం పడుతుందని ఆ తర్వాత ఏడాది ముందు నుండే ఎన్నికల వాతావరణం మొదలయ్యే అవకాశం వుండటంతో అధికారులు మాట వినకపోతే తమ సమస్య ఏమిటని సీనియర్‌ ఎమ్మెల్యేలు పదవులు తీసుకునేందుకు వెనుకాడుత్నుట్లు తెలిసింది. అదీకాక ఎన్నికలకు సంబంధించిన ఖర్చులనూ చూడాల్సి వస్తే తమ పరిస్తితి ఇబ్బందిగా ఉంటుందని ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యేలు విముఖతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనికి తోడు తమ సీనియారిటీని ముఖ్యమంత్రి గుర్తించకుండా రాజీనామా లేఖలు తీసుకున్నారని కొంతమంది మంత్రులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడున్న మంత్రుల్లో దాదాపు 10 మందికి మళ్లీ అవకాశం ఇచ్చే వాతావరణం కనిపిస్తోంది. ఇందులో భాగంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఆదిమూలపు సురేష్‌, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరామ్‌, సీదిరి అప్పలరాజు, పేర్నినానిని కొనసాగించే అవకాశం వుందని సమాచారం. రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై మారుతున్న సమీకరణల ఆధారంగా కొత్తగా కేబినెట్‌లోకి ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్‌, గుడివాడ అమర్‌నాథ్‌, ఎమ్మెల్యే రజనీ, కాకాణి గోవర్థన్‌రెడ్డి బెర్త్‌లు ఖరారయ్యాయని వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మైనారిటీ కోటాల్లో హఫీజ్‌ఖాన్‌, ముస్తఫాల్లో ఒకరికి చోటు కల్పించబోతున్నారు.
 

                                                           మూడుగంటల సుదీర్ఘ చర్చ

రాజీనామాల అనంతరం సీనియర్లలో వ్యక్తమైన ఆవేదనను పరిగణనలోకి తీసుకుని శుక్రవారం ముఖ్యమంత్రితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వాలనుకున్నవారిలో పదవి అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో అటువంటి వారిని పక్కనబెట్టి వారిస్థానంలో పాత వాళ్లనే కొనసాగించాలనే నిర్ణయానికి ప్రాథమికంగా వచ్చినట్లు తెలిసింది. దీంతో కూర్పుపై మంత్రులతోనూ మాట్లాడుతున్నారు. సజ్జల తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కూర్చుని జిల్లాలు, సామాజిక సమీకరణలు వారీగా సీనియర్‌ నేతలతో చర్చించారు. ఎన్నికల సమయంలో సమస్యలు తలెత్తకూడదని ఇప్పుడున్న మంత్రుల్లో దాదాపు పదిమందిని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. సీనియర్లతో చర్చల అనంతరం సజ్జల సిఎంతోనూ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. శనివారం మరోసారి మాట్లాడుకున్న అనంతరం మంత్రులను ఎవరిని తీసుకోవాలి, ఎవరిని కొనసాగించాలి అనే అంశంపై తుదినిర్ణయానికి రానున్నట్లు సజ్జల ప్రకటించారు. అంతకు ముందు మంత్రులు బొత్స, కురసాల, అనిల్‌కుమార్‌ తదితరులు కూడా ఇదే అంశాలపై చర్చించారు.
 

                                     ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు.. అధికారులకు సిఎస్‌ ఆదేశం

నూతన మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో పక్కన ఏర్పాటు చేసిన స్థలంలో 11వ తేదీన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు వచ్చేందుకు కరకట్ట మార్గంలో ట్రాఫిక్‌ను నియంత్రించాలని ఆదేశించారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై శుక్రవారం సిఎస్‌ సమీర్‌శర్మ అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమం సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముత్యాలరాజు మాట్లాడుతూ నూతనంగా ఎంపికైన మంత్రులకు కల్పించాల్సిన సదుపాయాలు, వారికి ఆహ్వానాలు పంపడం వంటి విషయాల్లో ఎటువంటి లోటుపాట్లూ జరగకూడదని తెలిపారు. కరకట్టపై వాహనాల రాకపోకల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటామని అదనపు డిజి రవిశంకర్‌ అయ్యన్నార్‌ తెలిపారు. సమాచారశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.