పుట్టపర్తి అర్బన్ : ఒలంపిక్స్‌లో పతకాలు తీసుకొచ్చి దేశప్రతిష్టను ప్రపంచానికి చాటిన రెజ్లర్లపై బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడడం అత్యంత సిగ్గుమాలిన చర్యని, తక్షణం ఆయన్ను చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్ డిమాండ్ చేశారు. బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గణేష్ కూడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఇంతియాజ్, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ దిల్షాద్ మాట్లాడుతూ న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రెజ్లర్లను బిజెపి పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. దేశానికి పేరుప్రతిష్టలు తీసుకొచ్చిన క్రీడాకారిణులు రెండు వారాలుగా న్యాయం కోసం తపిస్తున్నా మోడీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై రెజ్లర్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ప్రధాని మోడీకి ఎన్నికల రాజకీయాలే ముఖ్యంగా భావించి, ఇతర సమస్యలను గాలికొదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని భేటిపడావ్, భేటిబచావో అనే నినాదం మాటలకే పరిమితం అయ్యిందని విషయం రెజ్లర్ల ఆందోళన చూస్తే అర్థం అవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ స్పందించి ఆరోపణలు ఎదర్కొంటున్న ఎంపీని పార్టీ, పార్లమెంట్ సభ్యత్వం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఈఎస్.వెంకటేష్, బడా సుబ్బిరెడ్డి, ప్రవీణ్, పెద్దన్న, జంగాలపల్లి పెద్దన్న, జెడ్పీ.శ్రీనివాసులు, స్థానిక నాయకులు బ్యాళ్ల అంజి, పైపల్లి గంగాధర్ పాల్గొన్నారు.










