Feb 15,2023 21:30

రెగ్యులర్‌ పీడీని నియమించాలి

 రాయచోటి టౌన్‌ : అన్నమయ్య జిల్లాలో ఐసిడిఎస్‌ డిపార్ట్‌మెంట్‌కు రెగ్యులర్‌ పీడీని నియమించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సి.హెచ్‌. చంద్రశేఖర్‌, ఎ. రామాంజులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు 50 గ్రాముల కోడిగుడ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వ నిబంధనలున్నా 30 నుండి 35 గ్రాముల పరిమాణంలో ఉన్న గుడ్లను గుత్తదారుడు పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఎంటిఆర్‌ఫుడ్‌లో చక్కెర లేకుండా వస్తుందని చెప్పారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ కిట్లు రెగ్యులర్‌గా అంగన్వాడీ కేంద్రాలకు చేరలేదని వాపోయారు. గతంలో నాణ్యమైన పాల డబ్బా ఇచ్చేవారని, ఇప్పుడు ఇస్తున్న ప్యాకెట్‌ పాలు రుచిగా ఉండడం లేదని పలువురు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. దేవపట్ల , శెట్టిపల్లి సెక్టార్ల అంగన్వాడీ వర్కర్లకు, ఆయాలకు అక్టోబర్‌ జీతం, రాలేదని దీనిపై విచారణ చేపట్టి కారకులైన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో అర్హులైన ఆయాలకు ఉద్యోగోన్నతలు కల్పించాల్సి వస్తుందని వారిపై రకరకాల ఆరోపణలు చేయడం అధికారులకు తగదని పేర్కొన్నారు. . నాణ్యమైన పౌష్టికాహారం పాలు గుడ్లు పంపిణీ చేసే కాంట్రాక్టర్ల ను బ్లాక్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో రాజంపేట కార్యకర్తలకు 14 నెలల జీతం ఇవ్వాలని, మరో 28 మందికి రెండు, మూడు నెలలజీతం పెండింగ్‌ ఉందని, పెండింగ్‌ జీతం ఇచ్చే వరకూ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చిన్న చిన్న కారణాలు చూపి అంగన్వాడీలను మానసిక ఇబ్బందులు గురిచేస్తే సహించేది లేదన్నారు. నల్లగుట్టపల్లి అంగన్వాడీ వర్కర్‌ పూర్ణకుమారిపై తప్పుడు నివేదికలు తయారుచేసి తొలగించాలని చూస్తున్నారని కలెక్టర్‌ తక్షణం రాజకీయ వేధింపుల మీద జోక్యం చేసుకోవాలన్నారు.