Mar 18,2023 21:48

ఫొటో : ఆందోళన వ్యక్తం చేస్తున్న మహిళలు

రేషన్‌ ఇవ్వడంలేదని మహిళలు ఆందోళన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు పురపాలక పరిధిలోని 19వ వార్డు ఎసిఎస్‌ఆర్‌ కాలనీ పరిధిలో గత మూడు నెలల నుండి రేషన్‌ సక్రమంగా ఇవ్వడం లేదని శనివారం స్థానిక మహిళలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయంలోని డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు విలేకరులతో మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా సరిగా రేషన్‌ బియ్యం పంపిణీ చేయడం ఈనెల 19 లాస్ట్‌ డేట్‌ అయినా ఇప్పటికీ రేషన్‌ పంపిణీ చేయలేదని ఆందోళన చెందారు. పేద ప్రజలమైన తాము కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నామని, రేషన్‌ బియ్యంపై ఆధారపడి బతుకుతున్న తమకు నెలనెలా సక్రమంగా రేషన్‌ అందకపోవడంతో కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
వారిని రేషన్‌ పంపిణీ చేయడం లేదు అడిగితే మీరు ఎవరికైనా చెప్పుకోండని సమాధానం చెబుతున్నారని వివరించారు. అదేవిధంగా రేషన్‌ బియ్యం నాణ్యత లేదని, రబ్బరు బియ్యం కలిసి వస్తున్నాయని కొన్నిచోట్ల మంచి బియ్యం సరఫరా చేస్తున్నారని పేదవాళ్లకు మాత్రం రబ్బరు బియ్యం పంపిణీ చేస్తున్నారని ఆందోళన చెందారు. గతంలో రేషన్‌షాపు దగ్గరకి పోయి తెచ్చుకునే వాళ్లమని ఇప్పుడు ఈ వాహనాలు పెట్టి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆందోళన చెందారు. అధికారులు స్పందించి తమకు సకాలంలో రేషన్‌ బియ్యం అందే విధంగా కృషి చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఆర్‌ కాలనీ మహిళలు పాల్గొన్నారు.