Jul 13,2022 22:42

ప్రజాశక్తి - విజయవాడ : రేషన్‌ దుకాణాల ద్వారా ఇక గల్లీగల్లీలో 5 కిలోల ఎల్‌పిజి గ్యాస్‌ సిలిండర్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. బంగారం, వెండి వస్తువుల తయారీదారులు, చిరువ్యాపారులు, పేద కుటుంబాల వారు ఎక్కువగా ఐదు కిలోల సిలిండర్ల వినియోగంపై ఆధారపడుతున్నారు. బహిరంగ మార్కెట్లలో వీటికి డిమాండ్‌ ఉంది. అయితే అనధికారికంగా ఎల్‌పిజి గ్యాస్‌ను 5 కిలోల గ్యాస్‌ సిలిండర్లలో నింపి వినియోగదారుల నుండి అధిక ధరలకు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేషన్‌ దుకాణాల ద్వారా ఐదు కిలోల ఎల్‌పిజి గ్యాస్‌ సిలిండర్లను అందుబాట్లోకి తీసుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు రేషన్‌ డీలర్లకు కమీషన్‌ రూపంలో ఆదాయం లభించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. ఈ ప్రక్రియపై గ్యాస్‌ కంపెనీల ప్రతినిధులు, రేషన్‌ దుకాణాల డీలర్లు, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖాధికారులతో ఉన్నతాధికారులు ఇప్పటికే సమావేశం నిర్వహించారు. ఐదు కిలోల ఎల్‌పిజి గ్యాస్‌ సిలిండర్లు అవసరమైన వారు గ్యాస్‌ కనక్షన్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి రూ.1803 చెల్లించి సిలిండర్‌తోపాటు గ్యాస్‌ పొందవచ్చు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు 5 కిలోల గ్యాస్‌కు మాత్రం రూ.639 చెల్లిస్తే సరిపోతుంది. 5 కిలోల గ్యాస్‌ అమ్మకంపై రేషన్‌ దుకాణాదారుడికి ఆయిల్‌ కంపెనీ యాజమాన్యం రూ.106 కమీషన్‌ రూపంలో చెల్లిస్తుంది. ఒక్కో రేషన్‌ దుకాణంలో 20 చిన్న గ్యాస్‌ సిలిండర్లను నిల్వ పెట్టుకుని వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. రేషన్‌ దుకాణాల ద్వారా సిలిండర్లను సరఫరా చేయడం వల్ల వినియోగదారులకు సమీపంలోనే ఇవి అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో గ్యాస్‌ కంపెనీల నుండి నేరుగా రేషన్‌ దుకాణాలకు 5 కిలోల ఎల్‌పిజి గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేసేలా రేషన్‌ డీలర్లతో ఒప్పందం చేసుకుంటారు. రేషన్‌ దుకాణాల డీలర్లు గ్యాస్‌ కంపెనీలు నిర్థేశించిన రేట్లకే విక్రయించాల్సి ఉంటుంది.