Mar 27,2022 20:59

ప్రజాశక్తి-అమరావతి : దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానా లను నిరసిస్తూ ఈనెల 28, 29 తేదీలలో జాతీయ కార్మిక సంఘాలు నేతృత్వంలో రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా చేపట్టబోయే సార్వత్రిక సమ్మెలో కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా కార్మికులతో కలిసి సమ్మెకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో సంక్షేమం పేరిట సంక్షోభం సఅష్టిస్తూ ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెట్టే పనిలో ఉంది. నూతన వ్యవసాయ చట్టాల పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. నూతన విద్యా విధానం పేరుతో పాఠశాలలను ఎత్తివేసి గిరిజన విద్యార్థులను చదువుకు దూరం చేయడం, అంగన్వాడీ వ్యవస్థను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసి ఉద్యోగ భద్రత లేకుండా చేయడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. లేబర్‌కోడ్‌ల రద్దు, సమాన పనికి సమాన వేతనం రెగ్యులరైజేషన్‌, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికై రైతుల పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని, కార్మికుల హక్కుల పరిరక్షణకై మార్చి 28, 29 తేదీల్లో చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెలో అందరూ భాగస్వాములు కావాలని కార్మిక సంఘాలు కోరాయి. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని , పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించి ,ప్రైవేటీకరణను జాతీయ నగదీకరణ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఆదాయ పన్ను పరిధిలోని కుటుంబాలకు నెలకు రూ.7,500ఆర్థిక మద్దతు ఇవ్వాలని ,పెట్రోల్‌ డీజిల్‌ లేదా ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలని కార్మిక సంఘాలు కోరాయి. 'అంగనవాడి, ఆశా, మధ్యాహ్నభోజన పథకం, వెలుగు, ఉపాధిహామీ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ సమగ్ర శిక్ష, ఇతర స్కీం వర్కర్లకు కనీస వేతనాలివ్వాలని కోరాయి. సమాన పనికి సమాన వేతనం చట్టబద్ధం చేయాలి.నూతన పెన్షన్‌ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ పథకాన్ని పునరుద్ధరించాలి.ఉపాధి పథకంలో 200 రోజులు పని కల్పించాలి. కోవిడ్‌ విధుల్లో మరణించిన అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థల వారికి రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. దీంతోపాటుగా కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలి' అని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి.
'కరోనా విపత్తుతో ఉపాధి కోల్పోయిన ప్రయివేట్‌ టీచర్లు, లెక్చరర్లను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వెంటనే వారికి ఉపాధి కల్పించాలి.కరోనా కాలంలో ప్రయివేటు ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఆయా యాజమాన్యాలు వేతనాలు చెల్లించలేదు. దీంతో కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయివేట్‌ టీచర్లు, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఇతర అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలతో కలిసి ఐక్యంగా ఉద్యమాల్లో పాల్గంటే తమ హక్కులను కొంతైనా సాధించుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రయివేట్‌ ఉపాధ్యాయులకు వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలి. కనీస వేతనం నిర్ణయించి, ఈఎస్‌ఐ, పి.ఎఫ్‌ సౌకర్యం కల్పించాలి. ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆదుకోవాలి. హెల్త్‌ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇచ్చి,గృహ నిర్మాణానికి రుణాలు ఇవ్వాలి. కేంద్రాన్ని పాలించే బిజెపి ఐదు రాష్ట్రాల ఫలితాల అనంతరం పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెంచడం మొదలు పెట్టింది. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఆటో కార్మికులకు ఉరితాడుగా మారిన జిఒ 21 వల్ల ఆటో కార్మికులు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ చలానా పేరుతో పోలీస్‌ వేధింపులు అధికమయ్యాయి. పోలీసులు దాడులు ఆపాలి ' అని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి.ఈ నెల 28,29 న రెండు రోజుల పాటు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రైతు సామాన్య, మధ్యతరగతి ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని వివిధ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.