Sep 10,2020 07:40


కమ్యూనిస్టు ఆశయాలను జీవితాంతం ఆచరించిన ఆదర్శ కమ్యూనిస్టు పావెల్‌. కిడ్నీ వ్యాధికి చికిత్స పొందుతూ సెప్టెంబరు 8వ తేదీన కెజిహెచ్‌ లో మరణించాడు.
పావెల్‌ వృత్తి రీత్యా పెయింటర్‌. అయినా కమ్యూనిస్టు లక్షణాలన్నీ కలబోసిన విప్లవ యోధుడు. మూడు దశాబ్దాలకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పార్టీ, ప్రజా సంఘాల మహాసభల నేపథ్య చిత్రాలన్నీ పావెల్‌ కుంచె నుంచి జాలువారినవే. ప్రతి బ్యాక్‌డ్రాప్‌ ఎంతో అర్ధవంతంగానూ, వర్గ దృక్పథంతోనూ వుండేవి. ఆయన కుంచె తగలని జిల్లా రాష్ట్రంలో లేదని చెప్పవచ్చు. మేము ఆంధ్రా యూనివర్శిటీలో చదువుకొనే రోజుల్లో గోడలన్నీ ఎస్‌ఎఫ్‌ఐ రాతలతో నిండడానికి కారణం పావెల్‌. తన కుటుంబాన్ని పార్టీ కుటుంబంగా తీర్చిదిద్దాడు పావెల్‌. భార్య ఉమ ఐద్వా జోన్‌ కార్యదర్శిగానూ, కుమార్తెలు క్రాంతి, స్రవంతి ఎస్‌ఎఫ్‌ఐ లోనూ, తమ్ముడు అప్పలరాజు సిఐటియు లో చురుగ్గా పని చేశారు.
పార్టీ ప్రతి క్యాంపెయన్‌, ఎన్నికల ప్రచారం, మహాసభల సమాచారాన్ని పావెల్‌ పెద్ద అక్షరాలతో గోడలు నింపేవాడు. సుత్తి కొడవలి, ప్రతి అక్షరం 8 అడుగుల ఎత్తు వుండేవి. కుంచె కింది నుంచి చేతికి అందినంత ఎత్తు వరకు వెళ్లేది. సిపిఎం ప్రచార ధాటికి పెద్ద పార్టీలు కూడా తట్టుకోలేకపోయేవి. ఈ ఒరవడి 2014 అఖిల భారత పార్టీ మహాసభల వరకు సాగింది. ఫ్లెక్సీల ప్రభావంతో పెయింటింగ్‌ షాపులు మూతపడ్డాయి. ఆర్థిక పరిస్థితుల వల్ల షాపు అమ్ముకొనేవరకు పావెల్‌ ఆర్ట్స్‌కు డిమాండ్‌ తగ్గలేదు. పెయింటింగ్‌ రంగానికి సంబంధించిన జాతీయ పత్రికలు తెప్పించేవాడు. ఆ రంగంలో వస్తున్న మార్పులను నాయకులకు కూడా వివరించేవాడు.
1975లో బి.వి.రాఘవులు, నేను విశాఖపట్నం యూనివర్శిటీలో చేరేనాటికే పావెల్‌ 'విశాఖ నిరుద్యోగ యువజన సంఘం' నడిపేవాడు. ఆనాటికి పట్టణానికి నడిబడ్డు పూర్ణా మార్కెట్‌. అక్కడి బస్‌స్టాప్‌కు దగ్గర్లో పావెల్‌ సొంత ఇల్లు, రంగుల దుకాణం వుండేవి. యూనివర్శిటీ నుంచి బయటకు వస్తే ఆరోజుల్లో పావెల్‌ షాపే రాజకీయ కేంద్రం. దివి సీమ ఉప్పెన బాధితుల సేవా కార్యక్రమంలో విశాఖ నుంచి పాల్గన్న 15 మందిలో నాతో పాటు పావెల్‌ ఒకరు. పెయింటర్ల వృత్తిలో పోటీ ఎక్కువ. సాధారణంగా వుండే అనైక్యతకు అవకాశం లేకుండా యూనియన్‌ను ఏర్పాటు చేసి అందిరినీ ప్రోత్సహించడం ఆయన ప్రత్యేకత. నేటికీ పావెల్‌ శిష్యులు అనేకమంది అనేక జిల్లాల్లో కన్పిస్తారు.
ఏ వృత్తిలో వున్నా కమ్యూనిస్టు అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం పావెల్‌. ఆదర్శ కమ్యూనిస్టు. తన వృత్తిని పణంగా పెట్టి పార్టీకి అంకితమై పని చేశాడు. తన వృత్తి ద్వారా బాగా సంపాదించే అవకాశాలు వున్నా, ఏనాడూ సంపాదనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కమ్యూనిస్టు త్యాగ లక్షణాలన్నీ పావెల్‌ జీవితంలో అడుగడుగునా కనిపించేవి.
2004 జగదాంబ సిఐటియు భవన నిర్మాణ సభలో మొదటి విరాళం రూ.పది వేలు కవరుతో ముందుకు వచ్చింది పావెల్‌. ఆయన ఆర్థిక పరిస్థితి తెలిసిన పార్టీ నాయకత్వం తిరిగి ఇవ్వడానికి వెళితే ససేమిరా అంగీకరించలేదు. 'నా ఆర్థిక పరిస్థితి ఎలా వున్నా...భవనానికి నా విరాళం ఇస్తాన'ని పట్టుబట్టారు. భవనానికే కాదు. పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపునకు స్పందించిన విప్లవకారుడు పావెల్‌. పార్టీ సిద్ధాంతం పట్ల పూర్తి నిబద్ధత వుండేది. పార్టీ విధానాలను, అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలను బాగా ఆకళింపు చేసుకున్న నాయకుడు. ఆయన హోల్‌టైమర్‌ కాదుగాని...అంతకు మించి జీవితాంతం పనిచేసిన ధన్యజీవి.

(రచయిత సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)