Jan 31,2022 08:31
  • ముందుకు రాని బ్యాంకులు
  • అధిక వడ్డీలకు కౌలురైతుల అప్పులు
  • కౌలుచట్టం మార్పుతోనూ తీవ్ర నష్టం

ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : రబీలోనూ కౌలురైతులకు రుణాలందని పరిస్థితి పశ్చిమగోదావరి జిల్లాలో నెలకొంది. ఇప్పటివరకు బ్యాంకులు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. దీంతో కౌలురైతులు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది. జిల్లాలో మూడు లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. జిల్లా వ్యవసాయ సాగులో 75 శాతం కౌలు రైతులే చేస్తున్నారు. ఈ ఏడాది కౌలుకార్డుల అందజేత, రుణాల మంజూరులోనూ కౌలురైతులపై తీవ్ర వివక్ష కొనసాగింది. కేవలం 1.39 లక్షల మందికి మాత్రమే సాగుదారుని హక్కుపత్రాలు (కౌలుకార్డులు) మంజూరయ్యాయి. కార్డులున్న కౌలు రైతుల్లో కొందరికే రుణాలందాయి. ఈ ఏడాది మొత్తంలో ఇప్పటివరకు 43,525 మంది కౌలురైతులకు కేవలం రూ.197 కోట్లు రుణం మాత్రమే మంజూరయ్యాయి. మంజూరైన రుణాలు కూడా ఖరీఫ్‌లో ఇచ్చినవే. రబీలో ఇప్పటివరకు రుణాలు మంజూరు కాలేదు. ఎకరాకు రూ.30వేలకుపైగా కౌలురైతుకు పెట్టుబడి ఖర్చులువుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలివ్వకపోవడంతో కౌలురైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పులు తేవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లా వ్యవసాయ రుణ ప్రణాళికలో రూ.10 వేల కోట్లకుపైగా పంట రుణాలకు కేటాయించారు. అందులో కౌలురైతులకు ఇప్పటి వరకు ఇచ్చిన రుణాలు కేవలం రూ.197 కోట్లు మాత్రమే. నిబంధనల ప్రకారం సాగు చేసే రైతులకు పంట రుణాలు అందించాలి. భూయజమానులకు పంటేతర రుణాలివ్వాలి. బ్యాంకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. వాస్తవ సాగుదారుడైన కౌలురైతులకు కాకుండా భూయజమానులకు పంట రుణాలిస్తున్నాయి.
 

                                                చట్టం మార్పుతో కౌలురైతులకు అన్యాయం


2011లో కౌలురైతులకు ప్రత్యేకంగా అప్పటి ప్రభుత్వం భూ అధీకృత సాగుదారుని చట్టం తెచ్చింది. భూయజమానితో సంబంధం లేకుండా కౌలు రుణఅర్హత కార్డులు మంజూరు చేసి పంట రుణాలు మంజూరు చేయాలని చట్టంలో పొందుపరిచారు. దీంతో కౌలురైతులకు సంబంధించిన రుణార్హత కార్డుల మంజూరు, బ్యాంకుల నుంచి రుణాల వితరణపై రైతుసంఘాలు పెద్దఎత్తున పోరాటం చేశాయి. వైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక 2019 కౌలుచట్టంలో మార్పులు చేసింది. భూయజమాని అంగీకారంతోనే కౌలురైతులకు సాగుదారుని హక్కుపత్రాలు మంజూరు చేయాలని చట్టంలో చేర్చింది. దీంతో కౌలుదారులకు సాగుదారుని హక్కుపత్రాలు ఇచ్చేందుకు భూయజమానులు ససేమిరా అంటున్నారు. కౌలుకార్డు ఉంటేనే రైతుల పేర్లను ఈ-పంటలో నమోదు చేస్తున్నారు. అలా నమోదైన రైతులకు మాత్రమే పంట రుణాలు, నష్టపరిహారం, భీమా పరిహారం అందుతాయని ప్రభుత్వం తెలిపింది. చట్టం మార్పుతో సగం మంది కౌలురైౖతులకు కూడా సాగుదారుని హక్కుపత్రాలు మంజూరు కాలేదు. దీంతో కౌలురైతులకు బ్యాంకు రుణాలతో పాటు దెబ్బతిన్న పంటలకు పరిహారమూ అందని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలతో కౌలురైతులు వ్యవసాయం చేసేందుకు ఆసక్తి కనబరచడంలేదు.