రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశాఖ-తూర్పు గోదావరి సరిహద్దుల్లో బాక్సైట్ తవ్వకాలను పరిశీలించేందుకు నేడు టిడిపి నేతలు అయ్యన్నపాత్రుడు, చిన్నరాజప్ప, నక్కా ఆనంద్‌బాబు, కిడారి శ్రావణ్, అనిత, ఈశ్వరి, రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణిలతో కూడిన బృందం రౌతులపూడికి వెళ్లింది. అనంతరం టిడిపి నేతలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే, పోలీసులు మీడియా సమావేశాన్ని అడ్డుకున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ టిడిపి నేతలు నిరసనకు దిగారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు.. అయ్యన్నపాత్రుడు, చిన్నరాజప్ప మరికొందరి నేతలకు ఫోన్ చేసి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. రౌతులపూడి మండలం జల్దాం నుంచి విశాఖ జిల్లా సిరిపురం వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ విషయాన్ని టిడిపి నేతలు గమనించారు. దీంతో టిడిపి నేతలు అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప వంటి సీనియర్ నేతలతో కూడిన బృందం శుక్రవారం పరిశీలనకు వెళ్లింది. టిడిపి నేతలు అక్కడి స్థానిక గిరిజనులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా తమ పొలాలు, చెట్లు పోయాయని గిరిజనులు ఆవేదన వెలిబుచ్చారు. అనంతరం అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైటాయించారు. సుమారు నాలుగు గంటలపాటు నిరసన తెలిపారు. కేవలం లేటరైట్‌ను తరలించేందుకే రోడ్డు వేశారని టిడిపి నేతలు ఆరోపించారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలకు జగన్ ప్రభుత్వం తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వేయడం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ఎస్‌సి కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ ఘటనతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో టిడిపి నేతలకు చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. గిరిజన, అటవీ భూముల్లో రోడ్డు వేయడం వంటి పరిణామాలపై ఆరా తీశారు. తమను పోలీసులు అడ్డుకోవడాన్ని చంద్రబాబుకు వివరించారు. ఎంతసేపైనా అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేయాలని చంద్రబాబు సూచించారు.











