నివర్ తుపాను కోస్తా, రాయలసీమ రైతుల పాలిట పెను శాపంగా పరిణమించింది. లక్షలాది ఎకరాలు ఉన్నపళంగా నీట మునిగి వారికి తీరని ఆవేదనను, అనంత దు:ఖాన్ని మిగిల్చింది. పంటలు కోతకు వచ్చిన దశలో విరుచుకుపడి రైతులను నట్టేట ముంచింది. అదే విధంగా వరి పంట చేతికొచ్చే దశలో కురిసిన ఈ అకాల వర్షాలు వేలాది ఎకరాల లోని వరి పంటను సర్వ నాశనం చేశాయి. ఈ సంవత్సరం లెక్కకు మించి ఏర్పడిన అల్ప పీడనాలు రైతు మెడ చుట్టూ ఉరి కొయ్యలుగా తయారయ్యాయి. దాంతో దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్నల పరిస్థితి కడు దయనీయంగా తయారైంది. ఇదిలా వుంటే కౌలు, చిన్న, సన్న కారు రైతుల పరిస్థితి చెప్పలేకుండా వుంది. వ్యవసాయ శాఖ అధికారులు దెబ్బ తిన్న పంటల వివరాలు సేకరించి రైతులకు నష్ట పరిహారం తక్షణం అందేలా చర్యలు చేపట్టాలి. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి నష్ట పోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలి. వారిని ఆదుకోవాలి.
- బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచెర్ల, కర్నూలు జిల్లా.










