రాయచోటి : రైతులు లాభాల బాటలో నడిచేలా ప్రణాళికలు రూపొందించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో రాష్ట్ర ఉద్యాన సలహాదారు, జిల్లా వ్యవసాయ సలహా బోర్డు చైర్మన్ అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ విత్తనాలు, పురుగుమందులు సకాలంలో రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సలహా మండలి సమావేశంలో లేవనెత్తిన సమస్యలన్నీ కూడా అధికారులు నోట్ చేసుకొని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విస్తత సేవలు అందివ్వాలన్నారు. ఖరీఫ్ సీజన్లో సాగుకు అవసరమైన అన్నిరకాల నాణ్యమైన ఎరువులు, విత్తనాలను రైతుభరోసా కేంద్రాల్లో రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. పశువులకు సోకుతున్న లంపి స్కీన్ పట్ల పాడి పాడిపశువుల యాజమానులు అప్రమంతంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు గ్రామీణ ప్రాంతాలలో పశు వైద్యులు సకాలంలో వ్యాక్సినేషన్ అందించాలన్నారు. పసుపు పంట పండించిన రైతుల ఉత్పత్తిని మద్దతు ధరకు త్వరితగతిన కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖ ఎడిని ఆదేశించారు. ఆర్‌బికెలలో ఎరువుల కొరత లేకుండా సకాలంలో సరఫరా చేయాలన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వ అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పించి, ఆ పథకాలు లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ జెడిని సూచించారు. రైతులు సాగు చేసిన పంటల వివరాలను ఈ కాప్ బుకింగ్ చేయించుకోవాలన్నారు. డాక్టర్ వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నారు. రైతుకు వెన్నుదన్నుగా ఉండాలని వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులకు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజం సుకుమార్‌రెడ్డి తెలిపారు. పీలేరులో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్‌ను త్వరతిగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. వ్యవసాయ భూములకు సబ్సిడీ కింద సోలార్ ఫెన్సింగ్ అందించాలని వారు కోరారు. గ్రామాల వారీగా ఆర్‌బికెల పరిధిలో వ్యసాయ సహాయకులు సీజన్ వారీగా ఆయా ప్రాంతాల్లో పండించే పంటలు, వాటికి ఆశించే చీడపీడలు, పైర్లకు అందాల్సిన పోషక విలువలు, ఎరువుల వాడకంపై ముందస్తుగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్ర నాయక్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీంద్రబాబు, సిరికల్చర్ జిల్లా అధికారి రాజశేఖర్, ఎపిఎంఐపి పీడీ వెంకటేశ్వర రెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖ జెడి గుణశేఖర్ పెళ్లై డాక్టర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు దీన్నేపాడు రవిరాజు, బోదశ వలి పాల్గొన్నారు.










