Feb 01,2022 08:54
  • ఏ ఒక్క హామీని మోడీ సర్కార్‌ నెరవేర్చలేదు
  • రాజ్యాంగపరమైన బాధ్యతతో హెచ్చరించండి
  • రాష్ట్రపతికి సంయుక్త కిసాన్‌ మోర్చా లేఖ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో రైతులను మోడీ సర్కార్‌ మోసం చేసిందని, రాజ్యాంగపరమైన బాధ్యతతో ప్రభుత్వాన్ని హెచ్చరించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌ కె ఎం) కోరింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ కు ఎస్‌ కె ఎం ఓ వినతిపత్రం సమర్పించింది. రైతులకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఎస్‌ కె ఎం సోమవారం దేశవ్యాప్తంగా ''విద్రోహ దినం'' ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా రాష్ట్రపతితో పాటు దేశ వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, ఎంఆర్వోలకు రైతులు వినతిపత్రం ఇచ్చారు.

                                                        వినతిపత్రంలో కీలక అంశాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు చేసిన ద్రోహంపై విశ్వాస ఘాతుక దినం దేశవ్యాప్తంగా నిర్వహించామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని, కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని కోరుతూ ''సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌ కె ఎం) అపూర్వమైన ఉద్యమాన్ని నిర్వహించడం మీకు తెలుసు. ఈ ఉద్యమం వల్ల మీ సంతకంతో మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దయ్యాయి. ఆ తర్వాత ఆరు పెండింగ్‌ సమస్యలపై 2021 నవంబర్‌ 21న ప్రధానమంత్రికి ఎస్‌ కె ఎం లేఖ రాసింది. దీనికి ప్రతిస్పందనగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజరు అగర్వాల్‌ 2021 డిసెంబర్‌ 9న ఎస్‌ కె ఎంకు లేఖ రాశారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకుంటామని, ఎంఎసఫి చట్టం తెస్తామని ప్రభుత్వం తరపున ఆయన హామీ ఇచ్చారు.ఉద్యమాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ రాతపూర్వక హామీ ఆధారంగా సంయుక్త కిసాన్‌ మోర్చా డిసెంబరు 11 నుండి ఢిల్లీ సరిహద్దులను, ఇతర ఆందోళన ప్రాంతాలను ఖాళీ చేయాలని నిర్ణయించింది. ఎంఎస్‌పిపై ప్రభుత్వం మరోసారి రైతులను మోసగించిందని తీవ్ర విచారం, వేదనతో మీకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం డిసెంబర్‌ 9 నాటి లేఖలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. అందుకే దేశవ్యాప్తంగా రైతులు జనవరి 31న విశ్వాసఘాతుక దినం పాటించాలని నిర్ణయించుకున్నారు'' అని పేర్కొంది.
 

                                                             ప్రభుత్వ వాగ్దానం

ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూడండని రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ కు ఎస్‌ కె ఎం తెలిపింది. లేఖలోని వాగ్దానం ఇది ''రైతుల ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకుంటామని చెప్పారు. ఈ హామీని కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రభుత్వాలు ఇప్పటికీ నెరవేర్చలేదు. ఈ కేసుల్లో రైతులకు నిత్యం కోర్టు సమన్లు అందుతున్నాయి. హర్యానా ప్రభుత్వం మాత్రమే కొన్ని పేపర్‌ వర్క్‌లు చేసి కేసును ఉపసంహరించుకోవాలని కొన్ని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికీ ఈ పనులు అసంపూర్తిగా ఉండడంతో రైతులను పిలిపిస్తున్నారు'' అని ఎస్‌కెఎం తెలిపింది.
    కేసులు ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు కూడా విజ్ఞప్తి చేస్తుందని తెలిపింది. కాని ఇంతవరకు ఒక్క లేఖ కూడా రాష్ట్రాలకు పంపలేదు'' అని తెలిపింది.
   ''హర్యానా, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు రైతు ఉద్యమంలో అమరవీరుల కుటుంబాలకు పరిహారం కోసం సూత్రప్రాయంగా అంగీకరించాయి. అది కూడా అమలుకునోచుకోలేదు''
    '' ఎంఎస్‌పిపై ప్రధాన మంత్రి స్వయంగా, ఆ తరువాత వ్యవసాయ మంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని రైతులు ఎంఎస్‌పిని ఎలా పొందాలనేది కమిటీ ఆదేశాలలో ఒకటి. వాస్తవం ఏమిటంటే, ప్రభుత్వం ఈ అంశంపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించలేదు. కమిటీ స్వభావం, దాని పనితీరు గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు'' అని పేర్కొంది.
   ''లఖింపూర్‌ ఖేరీ ఊచకోత కేసులో ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్ర అభియోగాన్ని సిట్‌ నివేదిక ధ్రువీకరిస్తున్నప్పటికీ, రాజ్యాంగ, రాజకీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ కేసులో ప్రధాన కుట్రదారు అజరు మిశ్రా తేని కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగుతున్నారు. ఇది రైతులకు అవమానించడమే. మరోవైపు ఈ ఘటనలో నిందితులుగా ఉన్న రైతులను ఇరికించి అరెస్టు చేయడంలో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు చురుగ్గా ఉన్నారు'' అని తెలిపింది. ఎఫ్‌సిఐ తీసుకొచ్చిన కొత్త నాణ్యతా ప్రమాణాలతో పంట కొనుగోళ్లకు కోత పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎస్‌కెఎం పేర్కొంది.