జమ్మలమడుగు రూరల్/పెద్దముడియం : ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలోనే రైతులకు న్యాయం చేయకపోతే రాష్ట్రంలోని రైతులకు ఏం న్యాయం చేస్తారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 109వ రోజుకు చేరుకుంది. బుధవారం వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలంలోని సుద్దపల్లె విడిది కేంద్రం నుంచి జంగాలపల్లె, జె.కొట్టాలపల్లె, ఉప్పలూరు, బలపనూరు క్రాస్, ఎన్.కొట్టాలపల్లె మీదుగా పెద్దపసుపుల విడిది కేంద్రం వరకూ పాదయాత్ర సాగుగింది. ఆయా ప్రాంతాల్లో గండికోట ముంపువాసులు, రాజోలి ఆనకట్ట బాధితులు, రైతులతో మాటామంతి, ముఖాముఖి, సమావేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా పలు చోట్ల లోకేష్ మాట్లాడుతూ జగన్ మోహన్‌రెడ్డి అధికారంలోకి రాక ముందు రైతుల రాజ్యం వస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు అధికంగా జరిగాయన్నారు. మోసపూరిత వాగ్దానాలు, నెరవేర్చలేని హామీలు ఇచ్చారన్నారు. తాము అధికారం కోసం అబద్ధం చెప్పి మోసం చేయలేమన్నారు. ఇంత వరకు గండికోట ముంపు వాసులకు నిజమైన లబ్ధిదారులకు నష్టపరిహారం అందుకుండా ఉంటే వారికి అధికారంలోకి వచ్చాక కచ్చితంగా అందజేస్తామన్నారు. రాజోలి ప్రాజెక్టు బాధితులు అడిగిన ప్యాకేజీని నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి తెలియజేస్తానన్నారు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీలలో యుద్ధ ప్రాతిపదికన అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి ప్రతి ఇంటికీ నీటి కొళాయిలను అందిస్తామన్నారు. రెండు దశాబ్దాలుగా రాయలసీమలో తాగు, సాగు నీరు సమస్య ఉందని దానికి శాశ్వత పరిష్కారం ఈ ప్రభుత్వం చేయలేదన్నారు. ఇది కచ్చితంగా వైసిపి ప్రభుత్వ వైఫల్యమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గోదావరి కృష్ణా నదులను అనుసంధానం ద్వారా తాగు, సాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. రాజోలి ప్రాజెక్టు బాధితులు, రైతులు, గండికోట ప్రాజెక్టు ముంపువాసులు తమ సమస్యలను టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూపేష్‌రెడ్డి లోకేష్ దృష్టికి తెచ్చారు. తమ నియోజకవర్గ పరిధిలోని సమస్యలను తెలుసుకొని టిడిపి ప్రభుత్వం రాగానే శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. రాజోలి బాధితులు 20 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరారు. గండికోట ముంపు బాధితులు జగన్ ఇచ్చిన హామీ ఇంతవరకు అమలుకాలేదు దానిని పెంచి ఇవ్వాలని, ముంపు కాలనీలలో మౌలిక సదుపాయాలు సరిగ్గాలేవని, పూర్వపు పంచాయతీలను ఏర్పాటు చేసి అభివద్ధి చేయాలని కోరారు. పాదయాత్రలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ శివనాథ్‌రెడ్డి, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నతోట మల్లికార్జున, రైతులు, ముంపు బాధితులు పాల్గొన్నారు.










