Mar 23,2023 22:26

రైతుల సమస్యలపై ఉద్యానవన అధికారులకు వినతిపత్రం ఇస్తున్న రైతుసంఘం నాయకులు

       కదిరి టౌన్‌ : రైతన్నల ప్రాణాలు పోతున్న పట్టించుకోరా అని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యాన శాఖ అధికారులు పనితీరు మెరుగుపరడం లేదని రైతుల కష్టాలను వారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అధికారుల వైఖరిని నిరసిస్తూ గురువారం రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి ఆధ్వర్యంలో కదిరి పట్టణంలోని ఎడిఎ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కదిరి మండలం పరిధిలో ఉద్యాన పంటలైన టమోటా, బెండ ,అరటి , మామిడి, దోస, కర్బూజా, మొక్కజొన్న పంటలను రైతులు సాగు చేశారన్నారు. గత శని ఆదివారాల్లో కురిసిన అకాల వర్షాలకు 250 ఎకరాల్లో సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. రైతులకు తీవ్ర నష్ట జరిగినా జిల్లా అధికారులు , కదిరి డివిజన్‌ ఉద్యాన శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న దోస, కర్బూజా, టమోటా తదితర వాటిని రైతులు తీసుకొచ్చి కార్యాలయం ముందు పడేసి అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. మండలంలోన మూర్తి పల్లి , వరిగి రెడ్డిపల్లి, బత్తలపల్లి తదితర గ్రామాల్లో సాగుచేసిన ఉద్యాన పంటలు వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నా యన్నారు. ఉద్యాన శాఖ వ్యవసాయ శాఖ కార్యాలయానకి కూతవేటు దూరంలో ఉండే మూర్తి పల్లి గ్రామంలో పెద్ద ఎత్తున టమోటా ,మొక్కజొన్న, బెండ, తదితర పంటలు దెబ్బతిన్నప్పటికీ అధికారులకు కనబడడం లేదా అని నిలదీశారు. ఇంతవరకు గ్రామానికి వచ్చి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పాపాన పోలేదని విమర్శించారు. అలాగే ఉద్యాన శాఖ అధికారి ఎప్పుడొస్తారో, ఆ అధికారి ఎవరో తమకు ఇంతవరకు తెలియదని రైతులు అన్నారు. రైతుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌ రెడ్డి అక్కడికి చేరుకొని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పంట నష్టపోయి నాలుగైదు రోజులు గడుస్తున్నా దెబ్బతిన్న పంటలను సంబంధిత శాఖ అధికారి పరిశీలించిన పాపాన పోలేదని రైతులు ఈసందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దెబ్బతిన్న పంటలను పరిశీలిచి రైతుకు ఎకరాకు లక్ష రూపాయలు పరిహారం అందజేయాలని డిమాంండ్‌ చేశారు. రైతులకు అందుబాటులో లేని ఉద్యానవన అధికారపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులతో పాటు మూర్తిపల్లి, వరిగి రెడ్డి పల్లి తదితర గ్రామాల రైతులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.