మదనపల్లె అర్బన్: ప్రభుత్వం ఆవలంభిస్తున్న విధానాలతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగ మారిందని, టమోటా రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించకుంటే ఆందోళనలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా హెచ్చరించారు. శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.లక్షలు వెచ్చించి టమోటా పంటను సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రమైన ఆందోళనలో వున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి కిలో టమోటా రూ.15లకు కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి టమోటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలని కోరారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి మార్కెట్‌కు తీసుకువస్తే నామమాత్రపు ధరలు కూడా పలకకపోవడంతో క్రీట్లతో సహా కాయలను అక్కడే వదిలేసి వెళ్లిపోవాల్సిన దుస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టమోటా పంట చేతికి రావాలంటే 90 రోజులు కష్టపడి సాగు చేస్తే తప్ప ప్రతిఫలం ఉండదని, టమోటా ధరలు పతనంపై అధికార పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి ఎవరు స్పందించకపోవడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ఆదివారం లోపు ప్రభుత్వం టమోటాకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని,లేనిపక్షంలో సోమవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట టమోటాలతో పెద్ద ఎత్తున రైతులతో కలసి ధర్నాకు కూర్చుంటామని స్పష్టం చేశారు. శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు రాటకొండ మధుబాబు, ఎస్.ఎ.మస్తాన్, మోడెం సిద్దప్ప, విద్యా సాగర్, నీలకంఠ, నవీన్ చౌదరి, నాదెళ్ల విద్యా సాగర్, నాగూర్ వలి, షంషీర్, ఇంతియాజ్, గిరీష్, శ్రీరాములు, మహబూబ్ బాషా, హరి, వేమయ్య, నజీర్ నాదెళ్ల శివ, బండి అమరతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.










