Nov 07,2023 22:48

ప్రజాశక్తి-కాకినాడ రైతు అభ్యుదయం, వ్యవసాయ రంగ పురోగతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని కాకినాడ ఎంపీ వంగా గీత తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కార్యక్రమం కింద 2023-24 సంవత్సరానికి రెండో విడత సహాయం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎంపీ వంగా గీత, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు లంక ప్రసాద్‌, వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ఏ రైతూ సాగు చేపట్టేందుకు అప్పు చేయవలసిన పరిస్థితి రానీయకూడదనే ఆశయంతో రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికీ ఏటా రూ.13,500 సాగు ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా సహాయం క్రింద జిల్లాలో 1,80,434 మంది రైతులకు రరూ.74 కోట్ల 71 లక్షల ఆర్థిక సహాయాన్ని వారి ఖాతాలకు జమ చేసినట్టు తెలిపారు. కలెక్టర్‌ డాక్టర కృతికా శుక్లా మాట్లాడుతూ ఈ విడత సాయంతో కలిపి కాకినాడ జిల్లాలో 2019-20 నుంచి 2023-24 వరకూ గడచిన ఐదేళ్లకు గాను రూ.1,085 కోట్ల 50 లక్షల మొత్తాన్ని రైతులకు పంపిణీ చేసినట్టు తెలిపారు. జిల్లాలో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న పంటలను కాపాడేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, పటిష్ట నీటి సరఫరా కార్యాచరణతో రబీలో పూర్తి ఆయకట్టుకు నీరు అందించేందకు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి ఎన్‌.విజరు కుమార్‌, అధికారులు, రైతులు పాల్గొన్నారు.