Jun 01,2023 21:16

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రాయచోటి : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు వేలకోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని కలెక్టర్‌ గిరీష, శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాయచోటి పట్టణం సుండుపల్లె రోడ్డులోని ఓ కల్యాణ మండపంలో వరుసగా ఐదో ఏడాది 2023-24 సంవత్సరం మొదటి విడతగా వైయస్సార్‌ రైతు భరోసా పిఎం కిసాన్‌ సాయం కింద ఒక్కొక్కరికి రూ.7500 వేలు చొప్పున కర్నూలు జిల్లా పత్తికొండ నుండి బటన్‌ నొక్కి వర్చువల్‌ విధానంలో నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌, శాసనసభ వహారాల సమన్వయకర్త, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌, సభ్యులు, జిల్లాలోని రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వరుసగా ఐదో సంవత్సరం మొదటి విడతగా పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని ఇప్పటివరకు రైతు భరోసా కింద జిల్లాలో దాదాపు రూ.1000 కోట్ల మేర రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందని ముఖ్యమంత్రి తరచూ చెప్తారని రైతులను ఏ విధంగా ఆదుకుంటున్నారన్న విషయాన్ని రైతులందరూ కూడా ఆలోచించాలన్నారు. నాలుగు సంవత్సరాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రక్షాళన చేసిందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇంటి ముంగిటనే వివిధ రకాల సేవలు అందుతున్నాయని, వ్యవసాయ, ఉద్యానవన అధికారులు రైతులు ఇంటి వద్దకే వచ్చి సలహాలు అందజేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కషి చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పంట సాగుకు ముందే పెట్టుబడి సాయం అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్‌. సంవత్సరానికి రూ.7 వేలు చొప్పున నాలుగేళ్లలో రూ.28 వేల కోట్లు రైతులకు అందించారు. రైతులు వ్యవసాయంపై మక్కువ, శ్రద్ద పెట్టాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకుమార్‌రెడ్డి మాట్లాడుతూ. దివంగత నేత వైయస్సార్‌ రైతులను ఆదుకున్న విధంగానే ప్రస్తుత ముఖ్యమంత్రి రైతు సంక్షేమానికి పాటుపడుతున్నారు. ఆర్‌బికేల ద్వారా రైతు సేవా కార్యక్రమాలను విస్తతంగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. పంట వేయడానికి నెల ముందుగానే భరోసా లబ్ధిని రైతులకు ప్రభుత్వం అందిస్తోందిన్నారు. సమావేశంలో ప్రభుత్వ పథకాల లబ్ధిని అందుకున్న రైతులు తమ అనుభవాలను వివరించారు. అనంతరం వరుసగా ఐదవ ఏడాది 2023-24 సంవత్సరంలో మొదటి విడతగా అన్నమయ్య జిల్లాలోని 202094 మంది రైతులకు రూ.151.96 కోట్ల వైయస్సార్‌ రైతు భరోసా పిఎం కిసాన్‌ ఆర్థిక లబ్ధి, మార్చి, ఏప్రిల్‌ మరియు మే మాసాలలో కురిసిన అకాల వర్షాల వలన జిల్లాలో పంట నష్టపోయిన 1344 మంది రైతులకు రూ.1.79 కోట్ల ఆర్థిక సహాయం మెగా చెక్కులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా రైతులకు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.రైతులకు మెగా చెక్‌ను అందజేస్తున్న కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి