ప్రజాశక్తి -పెనుకొండ : రైతు రామయ్యకు న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సబ్‌కలెక్టరకు బుధవారం సమర్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ సోమందేపల్లి మండలం కావేటి నాగేపల్లి గ్రామానికి చెందిన పేద రైతు రామయ్య నాసిన్ సంస్థ నిర్మాణం కోసం భూసేకరణ సమయంలో తన భూమి ఇవ్వనని హైకోర్టును ఆశ్రయించాడన్నారు. అయితే నాసన్ సంస్థ ప్రతినిధులు రామయ్య కుటుంబాన్ని పోలీసులు ద్వారా నిర్బంధించి బలవంతంగా దౌర్జన్యంగా నిర్మాణ పనులు చేపడుతున్నారన్నారు. సంబంధిత అధికారులు హైకోర్టు ఉత్తర్వులు అమలు పరుస్తూ అక్రమ నిర్మాణ పనులను ఆపాలని తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధిత రైతు హైకోర్టును ఆశ్రయించాడన్నారు. అయినా దౌర్జన్యంగా పనులు చేపడుతున్నారని తక్షణమే నిర్మాణ పనులని అపాలని డిమాండ్ చేశారు. రైతు రామయ్య కుటుంబానికి అండగా ఉన్న సిపిఎం నాయకులు పనులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించి అక్రమంగా కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ జోక్యం చేసుకుని చట్టం ప్రకారం హైకోర్టు ఉత్తర్వులను అమలు పర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఫిరంగి ప్రవీణ్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ , సిఐటియు జిల్లా నాయకులు రఫీ, గౌస్ లాజం, బాబా, రాజగోపాల్, చాంద్ బాషా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.










