Dec 12,2020 07:06

అన్నం పెట్టే అన్నదాత
రోడ్డెక్కి హక్కులకై నినదిస్తుంటే ...
మనం ప్రేక్షక పాత్ర పోషిస్తే ఎలా ?
మట్టిని నమ్ముకున్న రైతన్న
చీకటి చట్టాల రద్దు కోసం
దేశ సరిహద్దుల్లో ఉద్యమిస్తుంటే ...
నట్టింట్లో నిరందిగా నిద్రిస్తే ధర్మమా ?
దేశం వెన్నెముక కర్షకుడు
ఢిల్లీ ముట్టడికి తరలుతుంటే ...
అలసత్వం హత్తుకుంటే సబబా?
అయినా వాళ్ళేం కోరారు ?
కనీస మద్దతు ధర అడిగారు
ఎవుసానికి సాయం అర్ధించారు
రైతు బతుకు ఆగం చెయ్యొద్దన్నారు
రైతు సల్లగుంటేనే కదా !
పంట చేలు పచ్చగా విలసిల్లేది
కడుపుకు బుక్కెడు బువ్వ దొరికేది
ఎద్దు ఏడ్చిన ఎవుసం ఎదగదు
రైతు కన్నీరొలికిన రాజ్యం బాగుపడదు
అందుకే !
అన్నదాత ధర్మపోరుకు
మద్దతుగా కదం తొక్కుదాం
ఆ ధిక్కార స్వరాలకు ...
గుండె ''గొంతుక '' అరువిద్దాం
ఎత్తిన పిడికిళ్లకు ...
నెత్తుటి ''సత్తువ'' ధారబోద్దాం
ఎగిరే ఎర్ర జెండాకు ...
చేయూత కర్రలై నిలబడదాం
ఆ ఎగసిన పోరు జ్వాలకు
సమిధనొక్కటి ఆహుతినిద్దాం
రండీ....దండుగా కదలి రండీ.
(అన్నదాత ఉద్యమానికి అక్షర మద్దతుగా)
 

- కోడిగూటి తిరుపతి
సెల్‌ : 95739 29493