ప్రజాశక్తి- తాడిమర్రి : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న దళిత రైతు భాస్కర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఎపి రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మండలకేంద్రంలోని రైతు కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ స్థితి గతులను, ఆర్థిక ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబపోషణ, వ్యవసాయం, ఇతర అవసరాల నిమిత్తం దాదాపు రూ.8.50 లక్షలు అప్పులు చేశాడని అప్పులకు వడ్డీలు కట్టలేక మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఈసందర్భంగా మృతుని కుటుంబ సభ్యులు నాయకులకు తెలిపారు ఈసందర్భంగా పెద్దన్న మాట్లాడుతూ ఆత్మహత్యచేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలన్నారు. మృతుని ముగ్గురు ఆడపిల్లలకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మారుతి, మండల అధ్యక్షులు పోతలయ్య తదితరులు పాల్గొన్నారు.










