అనంతపురం ప్రతినిధి : నిత్యం కరువుకు నిలయమైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఏడాది అధిక వర్షాలు ముంచేస్తున్నాయి. ఎప్పుడూ వర్షం కోసం అకాశం వైపు ఎదురు చూసే వారు. ఈసారి మాత్రం సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాలు పడుతున్నాయన్న ఆనందం అన్నదాతల కళ్లలో కన్పించడం లేదు. ఎడతెరిపిలేకుండా పడుతున్న వర్షాలు పంటలను నాశనం చేస్తూ రైతులకు నష్టాలను మిగులుస్తున్నాయి. పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావన్ని చూపుతున్నాయి. చేతకొచ్చిన పంటలు వర్షం దెబ్బకు నేలవాలుతున్నాయి. గత వారం రోజులుగా తుపాన్ దెబ్బకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు పంటలు దెబ్బతిని రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంతో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు బాగానే కురిశాయి. సాధారణంగా అక్టోబర్ వరకే జిల్లాలో వర్షాలు పడేవి. ఆ తరువాత వర్షం పెద్దగా పడేది కాదు. మాండూస్ ప్రభావంతో డిసెంబరులోనూ వర్షాలు పడ్డాయి. గత నాలుగు రోజులుగా దాదాపు అన్ని మండలాల్లో జడివాన పట్టుకున్ని చినుకులు పడుతూనే ఉన్నాయి. ఖరీఫ్ పంటలు నూర్పిడి జరుగుతున్న సమయంలో వస్తున్న వర్షాలతో రైతుకు అపార నష్టాన్నే కలిగిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 16 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో 10 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగవగా, తక్కిన ఇతర పంటలు సాగయ్యాయి. వేరుశనగ ఇప్పటికే నూర్పిడి పూర్తయ్యింది. ఇప్పుడు పడుతున్న వర్షాలు వరి, పత్తి, మిరప, కంది పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వరి పంట కోత దశకు వచ్చింది. 62 వేల ఎకరాల్లో వరి పంట సాగైంది. అది ఇప్పుడు నూర్పిడులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఎడతెరిపిలేకుండా పడుతున్న వర్షాలతో పొలంలోనే మొలకెత్తే పరిస్థితి నెలకొంది. కందిపంట 2.39 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇది కూడా కాపు దశకు వచ్చింది. వరుసగా పడుతున్న వర్షాలతో కందిపంట చెట్టుపైనే మొలకెత్తుతోంది. కంది కాయలు నల్లగా మారుతున్నాయి. పత్తి ఇప్పటికే పూర్తిగా దెబ్బతింది. రెండు లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. గతంలో ఎన్నడూలేనంతగా ఈ పంటలు సాగయ్యాయి. అక్టోబరు నుంచి పడుతున్న వర్షాలతో దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీని వల్ల నష్టం జరిగిందని ఇప్పటికే వ్యవసాయ శాస్త్రవేత్తలు సైతం గుర్తించారు. ప్రభుత్వానికి నివేదికలూ అందజేశారు. 70 వేల ఎకరాల్లో మిరప పంట సాగైంది. దీనికి నల్లి తెగుళ్లు పట్టి పడిస్తోంది. ఈ రకంగానూ రైతుకు నష్టం వాటిల్లింది.
మాండూస్‌తో వెయ్యి ఎకరాల్లో పంటనష్టం
మాండూస్ తుపాన్‌తో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెయ్యి ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనాలు రూపొందించారు. ఇందులో అధికంగా వరి పంటే ఉంది. ఎనిమిది మండలాల్లో ఎక్కువగా పంటనష్టం జరిగినట్టు గుర్తించారు. ఏడు మండలాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. 25 ఎకరాల్లో దెబ్బతిన్నట్టు అంచనా వేశారు. ఇవి ప్రాథమిక అంచనాలు. ఇంకా పూర్తి స్థాయి అంచనాల్లో ఏ మేరకు నష్టం వస్తుందో చూడాల్సి ఉంది. ఇవి వర్షాలతో దెబ్బతిన్న పంటలు మాత్రమే. తెగుళ్లు అధికమై దిగుబడులు నష్టం జరిగిన అంచనాలు ఇందులో ఉండవు. వీటిని లెక్కగడితే పంటనష్టం ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
42 శాతం అధికం
రెండు జిల్లాల పరిధిలో 42 శాతం అధికంగా వర్షాలు పడ్డాయి. అనంతపురం జిల్లా పరిధిలో సాధారణ వర్షపాతం 455 మిల్లీమీటర్లు అయితే 647 మిల్లీమీటర్లు నమోదయ్యింది. సాధారణం కంటే 42 శాతం అధికంగా పడింది. ఇక సత్యసాయి జిల్లా పరిధిలో 525.8 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతానికిగానూ 787.6 మిల్లీమీటర్లు నమోదయ్యింది. రెండు జిల్లాల పరిధిలోనూ ఈ ఏడాది వర్షాపాతం సాధారణంగా ఎక్కువగా నమోదయ్యింది. ఇందులో అనంతపురం జిల్లా పరిధిలో ఒక్క డిసెంబరు మాసంలో సాధారణ వర్షపాతం 6.7 మిల్లీమీటర్లు అయితే 32.4 మిల్లీమీటర్లు నమోదయింది. అంటే సాధారణం కంటే 383.4 శాతం అధికంగా నమోదవడం గమనార్హం.










