- కౌల్దార్లకు ఇప్పుడే కాదు
- మే 16న ఓనర్లకే
- నాల్గవ ఏటా అదే తంతు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : అన్నదాతలకు ఖరీఫ్ పెట్టుబడుల నిమిత్తం సీజన్ ప్రారంభంలో ప్రభుత్వం అందించే రైతు భరోసా సాయం ఈ సారి కూడా కౌలు రైతులకు ఇప్పుడే ఇవ్వడం లేదు. గత మూడేళ్లకు మల్లేనే కౌల్దార్లకు భరోసా సాయాన్ని కొన్ని నెలలపాటు సర్కారు వాయిదా వేసింది. ఖరీఫ్ పంట కోతల సమయంలో లేక రబీ మొదట్లో కౌల్దార్లకు భరోసా ఇవ్వనుంది. తొలుత స్వంత భూమి కలిగిన రైతులకు ఇచ్చాక, కౌల్దార్ల సంగతి చూద్దామని, ఆ లోపు కౌలు రైతుల గుర్తింపు, కొత్త కార్డుల జారీ, సిసిఆర్‌సిలపై అవగాహన చేపట్టనుంది. ఈ నెల 16న కేవలం భూయజమానులకు మాత్రమే భరోసా సాయాన్ని జమ చేయనున్నట్లు సమాచారం. నవరత్నాల్లో భాగంగా రైతులకు పెట్టుబడులు సమకూర్చేందుకు 'వైఎస్‌ఆర్ రైతు భరోసా' పేరిట ప్రతి ఏటా రూ.13,500 మూడు విడతల్లో అందిస్తోంది. కౌలు రైతులకూ ఈ సాయం అందిస్తామంది. కేంద్రానికి చెందిన పిఎం కిసాన్‌తో కలుపుకొని రైతు భరోసాను అమలు చేస్తోంది. కేంద్రం కౌలు రైతులకు సాయం చేయడం లేదు. కేవలం ఓనర్లకే ఇస్తోంది. ఖరీఫ్‌కు ముందు కేంద్రం రూ.2 వేలిస్తే, రాష్ట్రం రూ.5,500 కలిపి జమ చేస్తోంది. ఇదే సమయంలో కౌల్దార్లకు మొత్తం రూ.7,500 రాష్ట్రం తన నిధులే ఇవ్వాల్సి ఉంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం పథకం మొదలైన మూడేళ్ల నుండి ఖరీఫ్‌కు ముందు ఇచ్చే కిస్తును కౌలు రైతులకు ఇవ్వకుండా వాయిదా వేస్తోంది. నాల్గవ ఏట కూడా అదే పని చేసింది. ఈ నెల 16న రైతు భరోసా తొలి కిస్తు విడుదల చేయాలని శుక్రవారం సిఎం జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయ మైంది. అయితే ఆ రోజున కేవలం ఓనర్లకు మాత్రమే భరోసా సాయం జమ చేయనున్నట్లు సమాచారం.
తొలి ప్రాధాన్యం ఇవ్వాలి
రాష్ట్రంలో లక్షల్లో కౌలు రైతులున్నారు. వారికి బ్యాంక్ రుణాలు అందట్లేదు. ప్రైవేటు అప్పులే ఆధారం. ప్రైవేటు పరపతిపై వడ్డీలు చాలా ఎక్కువ. భూమిని నమ్ముకొని వాస్తవంగా పంటలు పండిస్తున్న కౌలు రైతులకు పెట్టుబడులు సమకూర్చడం ప్రభుత్వ తొలి ప్రాధాన్యంగా ఉండాలన్నది కౌలు రైతు సంఘాల, వ్యవసాయ ఆర్థిక వేత్తల, నిపుణుల అభిప్రాయం. ప్రభుత్వం మాత్రం తానిచ్చే స్వల్ప మొత్తాన్ని సైతం భూమి యజమానులతో పాటే కౌలు రైతులకూ ఇవ్వకపోవడంపై ఆందోళనలు వ్యక్తమవు తున్నాయి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చేదే చాలా తక్కువ. ఎపిలో 30 లక్షలకుపైన కౌల్దార్లు న్నారని సర్కారీ రికార్డులే చెబుతున్నాయి. 15 లక్షల మందికి భరోసా ఇస్తామని ప్రభుత్వమే చెప్పింది.
రెండూ అప్పుడే
2021-22లో 5.22 లక్షల కార్డులివ్వడం గగనమైంది. సిసిఆర్‌సి కాలపరిమితి 11 మాసాలే. భూమిలేని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకే భరోసా అన్న నిబంధన ఉంది. దాంతో పథకం మొదలైన మూడేళ్లల్లో నామమాత్రంగానే సాయం చేసారు. 2019లో 63 వేల మందికి, 2020లో 69 వేల మందికి, 2021లో 89 వేల మందికి భరోసా వేశారు. ఈ ఏడాదీ బడ్జెట్ ప్రతిపాదనల్లో లక్షలోపే లబ్ధిదారులుంటారని అంచనా వేశారు. వారికి ఇప్పుడే, మే 16న ఓనర్లతో కాకుండా ఎప్పుడో అక్టోబర్-నవంబర్‌లలో, మొదటి కిస్తు రూ.7,500, రెండవ కిస్తు రూ.4 వేలు కలిపి ఇవ్వనున్నారు.










