రాజు తలచుకుంటే
కొరడా దెబ్బలకు కొదవా ?
అదే కొద్ది దినాల నుండి
హస్తిన సరిహద్దులో
రైతుల వీపుపై చెళ్లున ఝుళిపిస్తోంది
నయా వ్యవసాయ చట్టాలతో
కార్పొరేట్ సంస్థలకు
కొమ్ము కాస్తున్న పాలకుల
వివాదాస్పద నిర్ణయాలను విరమించుకోవాలని
శాంతియుతంగా నిరసనలు చేస్తున్న
రైతుల మొహాలు వాటర్ కానన్లతో
వాయగొడుతూ కడుపులు చిట్లగొడుతూ
ఎండవానల్లో రేయింబవళ్లు
కండలు కరిగించి చెమటను రక్తంగా మార్చి
దేశానికి ఊపిరి పోస్తున్న
ఆ రైతుకు వెన్నుదన్నుగా ఉండాల్సింది పోయి
రైతే రాజు రైతే దేశానికి వెన్నెముకని
బహిరంగ సభల్లో ఊదరగొట్టే
ఈ కుహనా ఏలికలు
దేశద్రోహుల్లా చూస్తూ లాఠీలతో
వారి చర్మాలు ఊడగొడుతున్నారు
ఇదెక్కడి న్యాయం !
గుప్పెడు మెతుకులు
ఐదువేళ్ళతో నోట్లోకి పోతున్నాయంటే
ఆ అన్నదాతే కర్త కర్మ క్రియ
ఆ రైతే లేకుంటే దేశం సుభిక్షతలేని
దుర్భిక్షంతో కునారిల్లుతుందన్నది
పాలకులు తెలుసుకోవలసిన కర్తవ్యం
ప్రభుత్వాలు మొండి వైఖరి వీడి
ఆ మట్టిబిడ్డలను మట్టిలో కలసిపోకుండా
వారి ఆందోళనలు మన్నించాల్సిన
బాధ్యత ఎంతైనా ఉంది.
- నాగముని. యం,
సెల్ : 94908 56185










