Jan 20,2023 21:35

రైతు ట్రాక్టర్ల ర్యాలీ పోస్టర్లను విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘాల సమన్వయ కమిటీ నాయకులు

          ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌     ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతాంగాన్ని మోసగించిందని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ కమిటీ నాయకులు విమర్శించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా లో ఈనెల 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా రైతులతో ట్రాక్టర్లు, బైకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. స్థానిక శ్రీ సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ దగ్గర జిల్లా ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు జంగాలపల్లి పెద్దన్న బడా సుబ్బిరెడ్డి, జిల్లా సెక్రటరీ జెవి రమణ, కెకె ఎఐకెఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం. గిరీష్‌, సిఐటియు నాయకులు రామకృష్ణ, లక్ష్మీనారాయణ, పైపల్లి గంగాధర, గౌస్‌ లాజం ,బి గంగాధర, రైతు సంఘం జిల్లా రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ రెడ్డి, సంజీవ్‌ రాయప్ప, భీమన్న, కె.వి చలపతి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా రిపబ్లిక్‌ డే రైతు ట్రాక్టర్ల ర్యాలీ పోస్టర్లను రైతు సంఘాల సమన్వయ కమిటీ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఢిల్లీ రైతాంగ ఉద్యమం ఫలితంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసగించిందని విమర్శించారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి ఫార్ములా ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ మద్దతు ధరలు రైతులకు అందేలా మద్దతు ధరల గ్యారెంటీ చట్టం వెంటనే తేవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరలకు చట్టబద్ధత లేక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించకపోవడం అన్యాయమన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు రుణమాఫీ చేస్తున్న కేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పంట రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం తీసుకువచ్చి రైతుల పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లును రద్దు చేయాలని, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు కార్యక్రమాన్ని ఆపాలని కోరారు. సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. రైతులపై బనాయించిన అక్రమ కేసులు రద్దు చేయాలన్నారు. జిల్లాలో రైతుల ధాన్యం కొనుగోలులో వస్తున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.ఈనెల 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా మామిళ్ళకుంట్లపల్లి క్రాస్‌ నుండి గణేష్‌ సర్కిల్‌ వరకు సత్యసాయి జిల్లా రైతులు, కార్మికులు నిర్వహిస్తున్న రైతు బైకు ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.