- నడికుడి-కాళహస్తి - కోటిపల్లి- నరసాపూర్‌కూ కేటాయింపులు
- దక్షిణ మధ్య రైల్వే జిఎం సంజీవ్ కిశోర్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు రూ.10,080 కోట్లు బడ్జెట్లో కేటాయింపులు చేసిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు సంజీవ్ కిశోర్ వెల్లడించారు. ఇందులో తెలంగాణకు రూ.3,048 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా పనులు చేపట్టేందుకు రూ.7,032 కోట్లు కేటాయించిందన్నారు. 22-23 రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలపై గురువారం ఆయన ఆన్‌లైన్‌లో మీడియాతో మాట్లాడారు. నడికుడి-శ్రీకాళహస్తి కొత్త రైల్వే ప్రాజెక్టు కోసం రూ.1,501 కోట్లు కేటాయించారని, 309 కిలోమీటర్ల పొడవుగల ఈ ప్రాజెక్టు పనులను 2011-12లో రూ.2,289 కోట్ల వ్యయంతో మంజూరు చేశారన్నారు. ఇందులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉండగా, న్యూ పిడుగురాళ్ల-శావల్యాపురం మధ్య 46 కిలోమీటర్ల దూరం పనులు పూర్తయ్యాయని, మిగిలిన సెక్షన్లలో పనులు జరుగుతున్నాయన్నారు. కోటిపల్లి-నరసాపూర్ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు రూ.1,501కోట్లు కేటాయించారని, 2000-01లో రూ.2,120 కోట్ల వ్యయంతో మంజూరు చేశారన్నారు. కడప-బెంగళూరు నూతన రైల్వే ప్రాజెక్టుకు (ఎపి, కర్నాటక) రూ.289 కోట్లు కేటాయించారని, ఈ ప్రాజెక్టును 2008-09లో రూ.2,706 కోట్ల వ్యయంతో మంజూరు చేశారన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రాజెక్టు పనులు నాలుగు దశల్లో చేపడుతున్నట్లు జిఎం వెల్లడించారు. మొదటి దశలో కడప -పెండ్లిమర్రి మధ్య 21 కిలోమీటర్ల పనులు ఇప్పటికే ప్రారంభించా మన్నారు. విజయవాడ-గుడివాడ/మచిలీపట్నం, భీమవరం, నిడదవోలు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనుల కోసం రూ.1,681 కోట్లు కేటాయించారన్నారు. విజయవాడ-గూడూరు 3వ లైన్ ప్రాజెక్టు కోసం రూ.1000 కోట్లు కేటాయించారన్నారు. గూడూరు-బిట్రగుంట, కార్వాడి-బిట్రగుంట, కృష్ణ కెనాల్-కార్వాడి మధ్య మూడు దశల్లో పనులు ఏకకాలంలో ప్రారంభమయ్యాయన్నారు. కావలి-ఉలవపాడు మధ్య సెక్షన్‌లో 30 కిలోమీటర్లు, తలమంచి-శ్రీవెంకటేశ్వరపాలెం మధ్య 25 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయన్నారు. గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టు కోసం రూ.803 కోట్లు కేటాయింపులు జరిగాయన్నారు. కాజీపేట-విజయవాడ మూడో లైన్ ప్రాజెక్టుకు రూ.592.5 కోట్లు, గుత్తి-ధర్మవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని రైల్వే జిఎం వెల్లడించారు. నంద్యాల-ఎర్రగుంట్ల సెక్షన్‌లో విద్యుద్ధీకరణ కోసం రూ.51 కోట్లు కేటాయింపులు జరిగాయన్నారు. వీటితోపాటు కర్నూలు వద్ద మిడ్‌లైఫ్ రిహాబిలేషన్ ఫ్యాక్టరీ కోసం రూ.58 కోట్లు, తిరుపతి రైల్వే స్టేషన్‌లో దక్షిణం ప్రవేశద్వారం వైపు అభివృద్ధికి రూ.3 కోట్లు, తిరుచానూర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ.6.5 కోట్లు కేటాయించారని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు తెలిపారు.










