అమరావతి : రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లా ఎడారిగా మారిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు సిఎం జగన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. రాయలసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు రాసిన లేఖను చంద్రబాబు ఎందుకు ఖండించడంలేదని ప్రశ్నించారు. టిడిపి ఎమ్మెల్యేలు లేఖ రాసిన తీరు చూస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వ వాదనకు, తెలంగాణ ప్రభుత్వ అసత్య ప్రచారాలకు వంతపాడే విధంగా ఉందని విమర్శించారు. సూటిగా చెప్పాలంటే కెసిఆర్‌కు, టిఆర్‌ఎస్‌కు ఆ ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు కోవర్టుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారు సిఎం జగన్‌కు లేఖ రాయడాన్ని ఎపి బిజెపి తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాకో, రాష్ట్రంలో మరే ఇతర ప్రాంతానికో అన్యాయం జరుగుతుంటే మరో సందర్భంలో ప్రస్తావించవచ్చని, కానీ తెలంగాణ ఇవాళ అక్రమంగా నీటిని దొంగిలించుకుపోతుంటే.. దౌర్జన్యపూరితంగా ఎపి ప్రభుత్వ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తుంటే.. ఓవైపు అధికార వైసిపి చేతులెత్తేసిందని, బాధ్యతగా ఉండాల్సిన విపక్ష టిడిపి ఎమ్మెల్యేలు లేఖ రాయడం ద్వారా సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో టిడిపి అధినేత చంద్రబాబు వెంటనే స్పందించి ప్రకాశం జిల్లాకు చెందిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు లేఖలో పేర్కొన్న అంశాలు తమ పార్టీ విధానం కాదని చంద్రబాబు వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఒకవేళ అదే వారి పార్టీ విధానం అయితే టిడిపి.. టిఆర్‌ఎస్‌కు బీ టీమ్‌లా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.










