బి.కొత్తకోట : రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం రాజ్యమేలుతోందని తెలిపారు. ఎన్నడూ లేనివిధంగా ఎస్సీలపై దాడులు పెరిగాయాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 43వ రోజుకు చేరుకుంది. బుధవారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలోని గుట్టపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర గట్టు, కొండకిందపల్లి, బుచ్చిరెడ్డిపల్లి, ఇందిరమ్మకాలనీ విడిది కేంద్రం వరకూ పాదయాత్ర సాగుగింది. ఆయా ప్రాంతాల్లో స్థానికులు, ఎస్‌సి సామాజిక వర్గీయులు, ముస్లింములు, టమోటా రైతులు, బి.కొత్తకోట వాసులతో మాటామంతి, ముఖాముఖి, సమావేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా పలు చోట్ల లోకేష్ మాట్లాడుతూ కరోనా సమయంలో మాస్కు అడిగినందుకు విశాఖపట్నంలో దళిత డాక్టర్ సుధాకర్‌ను అన్యాయంగా హింసించి పొట్టనబెట్టుకున్నారని తెలిపారు. తూర్పుగోదావరిలో వైసిపి నేతల ఇసుక అక్రమాలను వరప్రసాద్‌కు శిరో ముండనం చేశారన్నారు. చిత్తూరులో మద్యం మాఫియాని ప్రశ్నించిని ఓంప్రతాప్‌ని హతమార్చారని చెప్పారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 12 వేల ఎకరాల భూములను లాక్కొన్న దళిత ద్రోహి జగన్ అని విమర్శించారు. దళితులకు చెందాల్సిన రూ.వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి తీరని అన్యాయం చేశారని తెలిపారు. దళితుల అభివృద్ధి, సామాజిక న్యాయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి స్వయం ఉపాధికి కృషి చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీల్లో పేదరికం లేకుండా చేయడమే టిడిపి లక్ష్యమన్నారు. తంబళ్లపల్లెలో తాలిబాన్ పాలన నడుస్తుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఉర్దూ టీచర్ల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. 2025 జనవరి 1న జాబ్ కేలండర్ విడుదల చేస్తామని, .అందులో ఉర్దూ టీచర్ల పోస్టులు కూడా ఉంటాయని తెలిపారు. ఏపీలో ఎప్పుడూ లేనంతగా మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. దాడులు చేసిన ఎవర్నీ వదలమన్నారు. ముస్లిం రిజర్వేషన్ల కోసం టిడిపి పోరాడుతోందని తెలిపారు. చిన్నాన్నను చంపిన వ్యక్తి తరపున ప్రభుత్వ లాయర్లను పెడుతున్నారు. కానీ ముస్లిం రిజర్వేషన్ల కోసం మాత్రం ఈ సిఎం పోరాడటం లేదని పేర్కొన్నారు. దుల్హన్ కింద రూ.50 వేలు మేము ఇచ్చాం..కానీ జగన్ రూ.లక్ష ఇస్తా అని మోసం చేశారన్నారు. మదనపల్లిని జిల్లా కేంద్రం చేస్తామని, ముస్లింలకు రెసిడెన్షియల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కుప్పంనకు పరిశ్రమలు వచ్చాయి..కానీ తంబళ్లపల్లెకి రాలేదని, దీనికి కారణం పాపాల పెద్దిరెడ్డి కుటుంబమేనని విమర్శించారు. పరిశ్రమలు పెట్టాలంటే వాటా ఎంతిస్తారని అడుగుతున్నారన్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓడించకపోతే నియోజకవర్గ ప్రజలు పేదరికంతోనే జీవించాల్సి వస్తుందని తెలిపారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఎపి మూడవ స్థానంలో ఉందన్నారు. ఎన్నికల ముందు గుర్తొచ్చిన టమోటా రైతులు, అధికారంలోకి వచ్చాక కనిపించకపోవడం దారుణమన్నారు. ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ మదనపల్లిలో ఉందన్నారు. టమోటా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. కోల్డ్ స్టోరేజీలు పెట్టి ధరలు పెరిగే వరకు అందులో నిల్వ ఉంచుకోగలిగితే రైతుకు ఉపయోగంగా ఉంటుందన్నారు. కోల్డ్ స్టోరేజీలు నిర్మించడలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక టమోటా పల్పింగ్ యూనిట్ పెడతామన్నారు. మదనపల్లి టమోటా మార్కెట్ బాధ్యతలను లోకేష్ తీసుకుంటాడని హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలనే ఆలోచనను టిడిపి ప్రభుత్వం ఏనాడూ చేయలేదన్నారు. పాదయాత్రలో మాజీ జడ్జి రామకృష్ణ పాల్గొని సంఘీభావం తెలియజేశారు.










