రాష్ట్రంలో దుర్మార్గ పాలన : బొల్లినేని
ప్రజాశక్తి-ఉదయగిరి : ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం రాష్ట్రంలో నడుస్తోందని, సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిన దుర్మార్గ పాలన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని మాజీ ఎంఎల్‌ఎ బొల్లినేని వెంకటరామారావు, జెడ్‌పి మాజీ చైర్మన్, టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి పొన్నెబోయిన చెంచలబాబు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక బస్టాండ్ సెంటర్‌లో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 27వ వర్థంతి వేడుకలను ఘనంగా మండల అధ్యక్షులు చింతనబోయిన బయన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఎన్‌టిఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా మండల నాయకుల ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎం జగన్ చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పు ఎవరు కట్టాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో రూ.2 వేల నోట్లు కనిపించడం లేదన్నారు. ఓట్ల కొనుగోలుకు అన్ని రూ.2వేల నోట్లను జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్‌లో దాస్తున్నారని ఆరోపించారు. పేదల రక్తాన్ని కూడా జలగలా తాగేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్‌టిఆర్ సిద్ధాంతాలను జయప్రదం చేయాలంటే సైకో పాలన పోవాలని, సైకిల్ పాలన రావాలని వారు ఆకాంక్షించారు. నియోజకవర్గంలో గడిచిన మూడున్నర సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. టిడిపి ప్రభుత్వంలో తాము అధికారులు ఉన్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేయించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశామన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వంపై ప్రజల నుండి నిరసనలు వస్తున్నాయని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 160 స్థానాలు గెలుపొంది తిరిగి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ఎన్‌టిఆర్ ఆశయ సాధన కోసం పనిచేయడమే ఆయనకు నిజమైన నివాళి అని, ఎన్‌టిఆర్ ఆశయ సాధన కోసం ఆయన కుటుంబ సభ్యులు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు షేక్ రియాజ్, బొజ్జ నరసింహులు, దుత్తలూరు టిడిపి కన్వీనర్ పేలపూడి వెంకటరత్నం, బొజ్జ శ్రీనివాసులు, షజిల్, సంధాని, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు శివకృష్ణ, నల్లిపోగు రాజా, దిగినబోయిన వెంకటస్వామి, మాబాషా పాల్గొన్నారు.










