Apr 02,2023 08:44

ధర్మవరంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్‌

      ధర్మవరం టౌన్‌ : రాష్ట్రంలో ప్రజలపై అనేక భారాలను మోపుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని టిడిపి జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌ పేర్కొన్నారు. నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర 57వ రోజు శనివారం నాడు ధర్మవరం సమీపంలోని ప్యాదిండి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ప్రారంభమైంది. మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాలశ్రీరామ్‌, పరిటాల సిద్దార్థతో కలిసి లోకేష్‌ పాదయాత్ర చేశారు. చెన్నేకొత్తపల్లి మండలం చందమూరు విడిది కేంద్రం నుంచి ధర్మవరం పట్టణ సమీపంలోని మార్కెట్‌ యార్డ్‌ వరకు 15 కిలోమీటర్ల మేర శనివారం పాదయాత్ర సాగింది. ప్యాదిండి ఆంజనేయస్వామి గుడి వద్ద నుంచి ప్రారంభమైన పాదయాత్ర ధర్మవరం పట్టణంలోని కేతిరెడ్డికాలనీ, ఇందిరమ్మ, వైఎస్‌ఆర్‌ కాలనీ, లక్ష్మీచెన్నకేశవపురం, సాయినగర్‌, ఆర్టీసీబస్టాండ్‌, కాలేజ్‌, కళాజ్యోతి, ఎన్టీఆర్‌ సర్కిళ్లు మీదుగా అంజుమన్‌, తేరు కూడిలి, కదిరి గేటు నుంచి మార్కెట్‌యార్డు వరకు కొనసాగింది. ప్యాదిండి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు రాగానే పరిటాల శ్రీరామ్‌ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. గజమాలలు వేసి ఆహ్వానించారు. ఆయా ప్రాంతాల్లో అడుగడుగునా నారా లోకేష్‌కు టిడిపి అభిమానులు ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రావడం లేదన్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయ్నారు. ప్రజలపై పన్నుల భారాలు వేసి నడ్డివిరుస్తున్నారన్నారు. వైసిపి పాలనలో మైనార్టీలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదన్నారు. జగన్‌ ఒక కట్టింగ్‌ అండ్‌ ఫిట్టింగ్‌ మాస్టర్‌ అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల భారాన్ని తగ్గిస్తామన్నారు. యువతకు స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, సవితమ్మ, కర్నూల్‌ జిల్లా పత్తికొండ టీడీపీ ఇన్‌ఛార్జి కేఈ శ్యాంబాబు, మదమంచి స్వరూప, అంబికా లక్ష్మీనారాయణ, గోనుగుంట్ల విజయకుమార్‌, ఎల్‌.నారాయణచౌదరి, ఎల్‌.నరేంద్రచౌదరి, రంగయ్య, రామ్మూర్తి నాయుడు, చింతలపల్లిమహేశ్‌ చౌదరి, కమతంకాటమయ్య, ఫణికుమార్‌, భీమనేని ప్రసాదనాయుడు పాల్గొన్నారు.
వినతులు... విజ్ఞాపనలు..
లోకేష్‌ పాదయాత్రలో పలువురు సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వ గహాల నిర్మాణం కోసం తమ భూములను సేకరించి పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీచేశారని, అయితే భూయజమానులకు గత ప్రభుత్వంలో ఇంటిపట్టాలు మంజూరు చేయగా ఈప్రభుత్వం వచ్చిన తరువాత రద్దుచేసిం దని మండల పరిదిలోని పోతులనాగేపల్లికి చెందిన పలువురు రైతులు నారా లోకేష్‌కు విన్నవించారు. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన అర్హులైన పేదలకు తిరిగి పట్టాలు ఇప్పించాలని కోరారు. ఆయన స్పందిస్తూ టీడీపీ ప్రభుత్వం రాగానే అర్హులందరికి ఇంటిపట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా శ్రీకష్ణదేవరాయ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించే విధంగా చట్టం తీసుకురావాలని కాపు కార్పోరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాలు, ధర్మవరంలో బలిజ భవనానికి స్థలం కేటాయించాలనే తదితర సమస్యలపై బలిజ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని టిడిపి వడ్డెర సంఘం నాయకులు పల్లపు రవీంద్ర ఆధ్వర్యంలో లోకేష్‌ను కోరారు. స్వర్ణకారులకు బీమా సౌకర్యం కల్పించాలని స్వర్ణకారులు వినతిపత్రం అందించారు.
పసుపునీళ్లతో స్వాగతం
యువగళం పాదయాత్ర పట్టణంలోకి ప్రవేశించగానే 25వ వార్డు టీడీపీ ఇన్‌ఛార్జి భీమనేని ప్రసాదానాయుడు ప్రత్యేక అభిమానంతో స్వాగతం పలికారు. ట్యాంకర్‌ను ఏర్పాటుచేసి పసుపునీళ్లతో లోకేష్‌కు స్వాగతం పలికారు. ప్యాదిండి ఆంజనేయస్వామి గుడి నుంచి పట్టణంలోని షిర్డీసాయి బాబా గుడి వరకు 6 కిలోమీటర్ల మేర పసుపునీళ్లతో నేలను తడుపుతూ స్వాగతం పలికారు.