రాయచోటి
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగుతోందని రాయచోటి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని పెమ్మడపల్లె పంచాయితీ, గరుగుపల్లెలో టిడిపి ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, రచ్చ బండ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో రోడ్లు సక్రమంగా లేవని, డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పారు. పెక్కడ చెత్త అక్కడే ఉందని, దీంతో దోమలు అధికమై ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారని వాపోయారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్‌ఛార్జీలతో అల్లాడిపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పేదలు సుఖంగా జీవించాలనే లక్ష్యంతో చంద్రబాబునాయుడు గతంలో సరుకుల ధరలు పెంచకుండా, బ్లాక్ మార్కెట్ తరలించకుండా కట్టడి చేశారన్నారు. రాష్ట్రానికి మిగులు విద్యుత్ అందించి విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రజలపై భారం మోపలేదన్నారు. రాబోవు రోజుల్లో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, అవినీతి అరాచక పాలన పోవాలన్నా, ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో రూరల్ అధ్యక్షులు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, సర్పంచ్ పల్లపు వాసు, మాజీ జడ్‌పిటిసి రామచంద్ర, మాజీ సర్పంచ్‌లు ఓర్చు వాసు, బసయ్య, నాగేశ్వర, రవిశంకర్, పల్లె నాగేంద్ర బాబు, మల్‌రెడ్డి, సుబ్బరాజు, వెంకటేశ్వర్లు, రామ్మోహన్, నాగేంద్రబాబు, నాగార్జున, హరిశంకర్, అంజినేయులు, రమేష్, రమణ, మణికంఠబాబు, నాగేశ్వరయ్య పాల్గొన్నారు.










