Mar 15,2023 20:46

- సమావేశంలో మాట్లాడుతున్న తులసిరెడ్డి

రాజంపేట అర్బన్‌ : రాష్ట్రానికి వైసిపి, టిడిపి పార్టీలు రాహుకేతువులు లాంటివని ముఖ్యమంత్రిగా వైఎస్‌,జగన్మోహన్‌రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారని రాష్ట్ర మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూల భాస్కర్‌ ఆధ్వర్యంలో ఆయన స్వగృహంలో ఆరు మండలాలకు చెందిన కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ జగన్‌ బాబారు వివేకానందరెడ్డి హత్య కేసును ప్రభుత్వం ఇంతవరకు ఛేదించకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్‌ కుమార్‌రెడ్డికి పార్టీ కీడు చేయలేదని, మేలే చేసిందని తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి బిజెపి, వైసిపి, టిడిపి ద్రోహం చేశాయని పేర్కొన్నారు. జగన్మోహన్‌రెడ్డి అసమర్ధ పాలన వలన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని, మరమ్మతులకు నిధులు ఇవ్వకపోవడంతోనే అలా జరిగిందని ఆరోపించారు. వరదల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన ఒక్క హామీ కూడా నేటికీ నెరవేర్చలేదని అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారని, ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన జూడో యాత్రతో కాంగ్రెస్‌ పార్టీ పూర్వవైభవం సంతరించుకున్నదని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గౌతమ్‌, అన్ని మండలాల నుంచి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.