Mar 19,2022 07:03

ఈ ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాలిక వ్యూహం, విజన్‌ లేదు. కేవలం రాజకీయ అవకాశవాద దృష్టి తప్ప రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దృక్పథమే లేదు. పైపెచ్చు కేంద్ర బిజెపి విధానాలను తలకెత్తుకుంటున్నది. బిజెపి కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన వ్యవసాయ కార్పొరేటీకరణకు, పెద్ద ఎత్తున డ్రోన్లు ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. కౌలు రైతులకు ఈ బడ్జెట్‌ తీవ్ర అన్యాయం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం రూ.2.56 లక్షల కోట్లతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయం రూ.2.08 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ.47 వేల కోట్లు, ద్రవ్య లోటు రూ.48 వేల కోట్లుగా ఉంటుందని ప్రతిపాదనలు చేశారు. 2021-22 సవరించిన బడ్జెట్‌ మీద ఈ బడ్జెట్‌కి రూ.55 వేల కోట్లు అదనంగా ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
      రాష్ట్ర బడ్జెట్‌కి ప్రధానంగా నాలుగు పద్దుల ద్వారా ఆదాయం వస్తుంది. 2022-23 బడ్జెట్‌కి వివిధ పద్దుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిశీలిస్తే మొదటిది రాష్ట్ర ప్రభుత్వానికి సొంత పన్నుల నుండి వచ్చే ఆదాయం. ఈ పద్దు కింద రాష్ట్ర వస్తు సేవలపై పన్ను ద్వారా రూ.29,024 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్‌ ద్వారా రూ.16,499 కోట్లు, అమ్మకాలు, వర్తకపు పన్ను ద్వారా రూ.28,481 కోట్లు, వాహన పన్ను ద్వారా రూ.5,999 కోట్లు, గనులు, మైనింగ్‌ ద్వారా రూ.4,999 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్‌ ద్వారా రూ.9,499 కోట్లు... ఇలా మొత్తం రాష్ట్ర పన్నుల ద్వారా రూ.90,764 కోట్లు సమకూరుతుందని అంచనా. గత బడ్జెట్‌ కన్నా సొంత పన్నుల ద్వారా అదనంగా రూ.17,548 కోట్ల ఆదాయం వస్తుందని ఈ బడ్జెట్‌లో ఆశిస్తున్నారు. కరోనా, ఆర్థిక వ్యవస్థలో మాంద్యం కొనసాగుతున్న నేపథ్యంలో గతేడాది కన్నా అదనంగా పన్నులు ద్వారా ఆదాయం సమకూరుతుందనేది కష్టమే. 2020-21లో రాష్ట్ర పన్నులు ద్వారా వచ్చింది రూ.57,157 కోట్లు. 2021-22లో రూ.84,880 కోట్లు వస్తుందని ప్రతిపాదించి దానిని రూ.73,218 కోట్లకు సవరించిన బడ్జెట్‌లో తగ్గించారు.
      రెండోది కేంద్ర పన్నుల నుండి రాష్ట్రానికి వచ్చే వాటా 2022-23 బడ్జెట్‌లో రూ.33,334 కోట్లు, 2021-22 సవరించిన బడ్జెట్లో రూ.31,971 కోట్లు వస్తుందని చూపారు. మన రాష్ట్రం నుండి కేంద్రానికి వెళ్లే పన్నులలో రాష్ట్రానికి 42 శాతం వాటా వస్తుంది. ఈ అంచనాల్లో పెద్దగా తేడాలు ఉండవు.
      మూడోది కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు తన బడ్జెట్‌ ద్వారా రాష్ట్రానికి గ్రాంట్లు ఇస్తుంది. ఈ పద్దు కింద కేంద్రం నుండి రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తుందని ప్రతిపాదన చేశారు. వాస్తవంగా 2020-21లో కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు మొత్తం రూ.31,871 కోట్లు మాత్రమే. 2021-22లో రూ.52,930 కోట్లు వస్తాయని అంచనా వేసి సవరించిన బడ్జెట్‌లో రూ.43,632 కోట్లకు కుదించారు. ఇప్పుడు రూ.56,032 కోట్లు వస్తాయని ప్రతిపాదించారు.
      2022-23లో చూపిన విధంగా కేంద్రం నుండి పెద్ద మొత్తంలో గ్రాంట్లు రావు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన విధంగా వస్తే చాలా గొప్ప. ఎందుకంటే కేంద్రం నుండి వచ్చే గ్రాంట్లు క్రమేణా తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో కొత్త పథకాలు లేకపోగా ఉన్నవాటిల్లో కొన్నింటిని రద్దు చేశారు. మిగిలిన వాటికి నిధులు కోత పెట్టారు.
      కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం ద్వారా ప్రణాళిక, ప్రణాళికేతర లోటు కింద రూ.10,549 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.12,099 కోట్లు, జి.ఎస్టీ నష్టపరిహారం, ఇతర విభజించని పూల్‌ నుండి రూ.5,050 కోట్లు వస్తుందని ఈ బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఇవి కూడా ఏవీ రావు. జి.ఎస్టీ నష్ట పరిహారం, రాష్ట్ర రెవెన్యూ లోటు ఇక ఇవ్వబోమని కేంద్రం తేల్చిచెప్పింది. మొత్తంగా చూస్తే కేంద్ర గ్రాంట్ల పద్దు కింద సుమారు రూ.25 వేల కోట్లు కోత పడుతుంది.
       నాల్గోది అప్పుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం. ప్రభుత్వ ఖర్చులకు తగిన విధంగా ఆదాయం రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీదే ఆధారపడి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించుతున్నది. ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ.4.39 లక్షల కోట్లకు చేరింది. ఇది రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 32.79 శాతంగా ఉంది. ఇదికాక మరో రూ.లక్షా 17 వేల కోట్ల మేర అప్పులకు విద్యుత్‌, ఇతర సంస్థలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. 2021-22లో రూ.40 వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఈ ఏడాది రూ.55 వేల కోట్లు అప్పుకి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ద్రవ్యలోటు 3.64 శాతానికి చేరింది. ఎఫ్‌ఆర్‌బిఎమ్‌ నిబంధనల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ద్రవ్యలోటు 3 శాతం కంటే మించకూడదు. ఇప్పటికే పరిధి మించడం వలన బడ్జెట్‌లో చూపిన అప్పులు కంటే అదనంగా అప్పులు తీసుకోవడం సాధ్యం కాదు. ఒకవేళ అదనంగా అప్పులు తీసుకోవాలంటే కేంద్ర బిజెపి పెట్టే షరతులను ఆమోదించాల్సిందే. లేదంటే కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలి. ప్రభుత్వం కేంద్రంతో పోరాడేకన్నా లొంగిపోయే చర్యలకే దిగజారుతున్నది.
    ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదనపు అప్పుల కోసం ప్రజలపై పన్నుల భారాల విధింపునకు, ప్రజల హక్కులను, సంక్షేమాన్ని నీరు గార్చడం, ప్రైవేటీకరణ చర్యలకు పాల్పడుతున్నది. వీటిలో భాగంగానే పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను ఆస్తి విలువ ఆధారంగా తీసుకొచ్చి ఆస్తి పన్ను ప్రతి ఏడాది పెంచే చర్యలు చేపట్టింది. చెత్తపై యూజర్‌ ఛార్జీలు తీసుకొచ్చింది. మురుగు నీటిపై పన్ను విధింపు, నీటి ఛార్జీల పెంపునకు చర్యలు చేపట్టింది. పట్టణ పౌర సేవలను సరుకులుగా మార్చడం, ఈ సేవలను ప్రైవేటీకరించడం వంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఒడిగట్టింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేర కార్మిక చట్టాలను మార్చటం, విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరించడం వంటి ప్రమాదకర చర్యలకు కూడా తెర లేపి అప్పుల కోసం ప్రభుత్వం ప్రజలను బలి తీసుకుంటున్నది.
      ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు, చేస్తున్న ఖర్చులను చూస్తుంటే చాలా ఆందోళన కల్గిస్తుంది. చేసిన కేటాయింపులు భారీ కోతలకు గురౌవుతున్నాయి. గత మూడేళ్ళ నుండి నవరత్నాల చుట్టే ప్రభుత్వం జపం చేస్తున్నది. ఈ సంక్షేమ పథకాలు కొంతమేరకు ప్రజలకు ఉపశమనం కలిగించినా ఇవి కూడా క్రమేణా మసకబారుతున్నాయి. 2022-23 బడ్జెట్లో రూ.48,802 కోట్లు కేటాయించింది. అయితే ఈ కేటాయింపులు పూర్తిగా ఖర్చు చేస్తుందని గ్యారెంటీ లేదు. ఎందుకంటే 2021-22లో నవరత్నాలకు రూ.48,083 కోట్లు కేటాయించి రూ.39,615 కోట్లకు కోత పెట్టారు. 2020-21లో కూడా రూ.43,942 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందువల్ల నవరత్నాల కేటాయింపులు అనివార్యంగా కోతకు గురవుతాయి. ఆ మేరకు పథకాల లబ్ధిదారులను తొలగించడానికి ప్రభుత్వం పాల్పడుతుంది.
    బడ్జెట్లో పెట్టుబడి వ్యయానికి కేటాయిస్తున్న కొద్దిపాటి నిధులను కూడా ఖర్చు చేయకుండా భారీ కోత పెడుతున్నది. పెట్టుబడి వ్యయం ప్రణాళికాబద్ధంగా ఎక్కువగా చేస్తే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అవడంతో పాటు సామాన్య ప్రజల ఆదాయాలలో కూడా గణనీయమైన పెరుగుదల వస్తుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ బడ్జెట్లో రూ.47,996 కోట్లు కేటాయించారు. గత చరిత్ర చూస్తే ఈ పద్దు కింద సగానికి సగం కోతలే. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో కేవలం రూ.12,242 కోట్లు, ఆ తరువాత 2020-21లో రూ.18,797 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2021-22లో రూ.31,198 కోట్లు కేటాయించి రూ.18,529 కోట్లకు కోత పెట్టారు.
        ఈ ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాలిక వ్యూహం, విజన్‌ లేదు. కేవలం రాజకీయ అవకాశవాద దృష్టి తప్ప రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దృక్పథమే లేదు. పైపెచ్చు కేంద్ర బిజెపి విధానాలను తలకెత్తుకుంటున్నది. బిజెపి కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన వ్యవసాయ కార్పొరేటీకరణకు, పెద్ద ఎత్తున డ్రోన్లు ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. కౌలు రైతులకు ఈ బడ్జెట్‌ తీవ్ర అన్యాయం చేసింది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కలిపి ఈ బడ్జెట్లో రూ.13,620 కోట్లు కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్లో 5.3 శాతం మాత్రమే. గత బడ్జెట్లో ఈ రంగానికి రూ.13,517 కోట్లు కేటాయించి రూ.11,942 కోట్లకు తగ్గించారు.
        నిరుద్యోగ యువతకు ఈ బడ్జెట్‌ పూర్తిగా మొండిచేయి చూపింది. ఉద్యోగాల భర్తీ చేస్తామని కూడా కనీసం ప్రకటించ లేదు. వ్యవసాయం తరువాత అసంఘటిత రంగంలో 80 లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. వీరి కనీస వేతనం రూ.26 వేలుగా ప్రకటించలేదు. వీరి ఆదాయాలు, జీవన వ్యయం భారీగా పెరిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అవుతుంది. మరొక ముఖ్యమైనది సముద్ర తీర ప్రాంతం. తొమ్మిది జిల్లాల పరిధిలో 996 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. ప్రభుత్వ పెట్టుబడులు పెంచి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు. సముద్ర ఉత్పత్తులపై 26 లక్షల మంది జీవనం సాగిస్తున్నారు. గత మూడేళ్ళ నుండి ఫిష్షింగ్‌ నౌకాశ్రయ నిర్మాణం పేరుకే ప్రస్తావన తప్ప నిధులు మాత్రం ఖర్చు చేయటం లేదు. అంతేగాక సముద్ర తీర పోర్టులన్నింటినీ ప్రైవేటుపరం చేయటంతో పాటు సముద్ర తీరంపై కార్పొరేట్‌ శక్తుల గుత్తాధిపత్యాన్ని పెంచుతున్నది.
        సహకార చక్కెర పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం నామరూపాలు లేకుండా చేయటానికి సిద్ధమయ్యింది. అందుకే ఈ బడ్జెట్లో వీటి అభివృద్ధికి నిధులు లేవు. వ్యవసాయం ఛిద్రమౌతున్న నేపథ్యంలో గ్రామీణ రంగంలో పాడి పరిశ్రమ ప్రజల జీవనంలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ రంగంలో సహకార రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా పాల ఉత్పత్తిదారుల ఆదాయాలను పెద్ద ఎత్తున పెంచొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోలేదు. పైపెచ్చు రాష్ట్రంలో ఈ రంగాన్ని అమూల్‌కు అప్పజెప్తున్నట్లు బడ్జెట్‌లో నిస్సిగ్గుగా ప్రకటించారు.
      రాయలసీమ, ఉత్తరాంధ్రలతోపాటు రాష్ట్రంలో మరికొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. కేంద్రం ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ గత రెండేళ్ల నుండి నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి బడ్జెట్లో నిధులు కేటాయించొచ్చు. కానీ బడ్జెట్లో ఈ ఊసేలేదు. అలాగే నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం మరొక ముఖ్యమైన లక్ష్యం. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 54 ప్రాజెక్టులకు గాను 14 పూర్తయ్యాయని ప్రభుత్వం చెబుతున్నది. ప్రతి బడ్జెట్లోనూ ఈ రంగానికి కేటాయించిన నిధులు కోతకు గురవుతున్నాయి. ఈ బడ్జెట్లో రూ.9,810 కోట్లు కేటాయించారు. చేసిన ఖర్చులు చూస్తే గతేడాది రూ.10,238 కోట్లు కేటాయించి రూ.6,832 కోట్లకు సవరించారు. 2020-21లో రూ.3,431 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ఖర్చుల్లో కూడా అధిక భాగం పోలవరం ప్రాజెక్టుకే పోతుంది.
       విద్యారంగం మొత్తం అమ్మఒడి చుట్టూ ప్రభుత్వం తిప్పుతున్నది. విద్యా దీవెన, వసతి దీవెనలో భారీగా కోతలు పెట్టారు. గత బడ్జెట్‌లో ఏకంగా రూ.1,585 కోట్లు కోత పెట్టారు. కాలేజీ, ఉన్నత విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. యూనివర్సిటీలు నిధులు, అధ్యాపకులు లేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ప్రాథమిక విద్య అవకాశాలను కూడా కుదిస్తున్నారు. ఆరోగ్య రంగంలో కూడా ఇదే దుస్థితి కొనసాగుతుంది. పట్టణ రంగానికి నిధులు కేటాయింపు ఈ బడ్జెట్లో తగ్గాయి. విశాఖ, విజయవాడ వంటి నగరాలు మెట్రో రైలు నిర్మాణం, పెద్ద రోడ్ల నిర్మాణం, ఫ్లై ఓవర్లు, మురికి వాడల్లో సమగ్ర మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ ఉపాధి హామీ వంటి చర్యలకు నిధులు కేటాయింపు ఈ బడ్జెట్లో శూన్యం.
                                   రాష్ట్రాభివృద్ధికి విజన్‌ కొరవడిన బడ్జెట్‌            డా. బి. గంగారావు / వ్యాసకర్త సెల్‌ : 9490098792 /