రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ అవినీతిపై విచారణ జరపాలి : ఒలింపిక్ అసోసియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని నిబంధనలు పాటిస్తూ క్రీడలు అభివృద్ధి కాకుండా అవినీతికి పాల్పడుతున్న స్పోర్ట్స్ అథారిటీ అధికారులపై విచారణ జరిపి క్రీడలు అభివృద్ధికి దోహదపడాలని రాష్ట్ర ఒలింపిక్ అసోసియన్ ప్రధాన కార్యదర్శి ఆర్ కె పురోషోత్తం రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. ఆదివారం విజయనగరం నగరంలో జి ఎస్ ఆర్ హోటల్లో రాష్ట్ర ఒలింపిక్ అసోసియన్ సమావేశ అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్పోర్ట్స్ అధికారులు తీరుపై మండిపడ్డారు. గత ప్రభుత్వంలో క్రీడలు అభివృద్ధికి జరిగిన అన్యాయం నేడు రాష్ట్రంలో క్రీడాకారులుకు, క్రీడా సంఘాలకు జరుగుతుందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి పదులు సంఖ్యలో టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్ క్రీడలకు వెళుతుంటే మన రాష్ట్రం నుంచి కేవలం ముగ్గురు క్రీడాకారులు వెళుతున్నారంటే ఎంత దయనీయంగా పరిస్థితి క్రీడలకు ఉందో అర్ధమవుతుందన్నారు. స్పోర్ట్స్ అథారిటీ మమ్మల్ని క్రీడాకారులుగా, క్రీడా సంఘాలుగా గుర్తియంచాలన్నారు. స్పోర్ట్స్ ఆధారిటీలో ఉన్న అధికారులు ఎక్కడా లేని రూల్స్ తీసుకొచ్చి భారీ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఎటువంటి అర్హత లేని వారి దగ్గర డబ్బులు తీసుకొని క్రీడాకారులను, కోచ్ లను ఎంపిక చేస్తున్నారన్నారు. జాతీయ గేమ్స్-2108 మన రాష్ట్రంలో నిర్వహించకపోవడం, ఒక్క ట్రాక్ కూడా రాష్ట్రంలో లేదంటే క్రీడల అభివృద్ధికి స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఎలా పని చేస్తున్నారో అద్దం పడుతోందని అన్నారు. రాష్ట్రంలో 25 ట్రాక్ లు ఏర్పాటు చేయాలన్నారు. క్రీడా సంఘాలు, ఒలింపిక్ అసోసియన్ సలహాలు తీసుకోకుండా నియంతలా అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. వెంటనే ముఖ్యమంత్రి కలుగుచేసుకొని స్పోర్ట్స్ అథారిటీ అధికారులు అక్రమాలపై విచారణ జరిపి, రాష్ట్రంలో క్రీడలు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. క్రీడలు అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలకు అసోసియన్ గా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఒలింపిక్ అసోసియన్ సభ్యులు బి.వెంకట్రామయ్య, పద్మనాభం, జిల్లా ఒలింపిక్ అసోసియన్ అధ్యక్ష, కార్యదర్సులు గురానా అయ్యలు, సిహెచ్ వేణిగోపాలరావులు పాల్గొన్నారు.










