రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే పాదయాత్ర
ప్రజాశక్తి-అల్లూరు : రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌బాబు పాదయాత్ర చేస్తున్నారని మండల నాయకులు బీద గిరిధర్ వెల్లడించారు. శుక్రవారం స్థానిక పోలేరమ్మ ఆలయం వద్ద యువగళం పేరుతో చేపడుతున్న పాదయాత్రకు సంఘీభావం తెలిపి టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా పాత బస్టాండ్ వద్ద ఉన్న వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి పరిపాలన గాడి తప్పిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం 400 రోజులు 4 వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేస్తున్నారని తెలియజేశారు. అందులో భాగంగా తొలిరోజు కుప్పం నుండి అంగరంగ వైభవంగా యాత్ర ప్రారంభమైందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆయన్ని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలంటే కేవలం తెలుగుదేశంతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. ఎక్కడ చూసినా అవినీతిమయంతో రాష్ట్ర ప్రజలు దగా పడుతున్నారన్నారంటూ సంబోధించారు. బండి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ సైకో పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైందని ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం చెల్లించలేని దుర్భర స్థితిలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా జీతాలు సకాలంలో చెల్లించాలని గవర్నర్‌కు మొరపెట్టుకోవడం ఇదే ప్రథమమని తెలిపారు. అధికంగా ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని తెలిపారు. ఈ రాష్ట్రానికి జగన్ చేసిన మేలేమిటో తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో బుల్లా కృష్ణారెడ్డి, రామిశెట్టి కృష్ణ చైతన్య, అరగల రమణయ్య, షేక్.నజీర్ బాషా, అంబటి రాజేంద్ర, కావలి జగన్‌మోహన్‌రావు తదితరులున్నారు.










