విశాఖ : మోడీ కార్పొరేట్ అనుకూల విధానాలు సామాన్యులను కాల్చుకుతింటున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాల్లో సమూల మార్పులు రావాలని కోరుతూ... కార్మిక, కర్షక సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. నేడు, రేపు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో.. సోమవారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ ... ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకూడదని అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మద్దిలపాలెం దగ్గర రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో సిపిఎం నాయకులు ఎం.జగ్గు నాయుడు, ఆర్ కె సి కుమార్, ఏఐటీయూసీ నాయకులు మన్మధరావు, తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. నేడు పెదబయలులో బంద్ కొనసాగుతోంది. ప్రధాన రోడ్లపై బైఠాయించి నేతలు నిరసన తెలిపారు. సిపిఎం నేతలు బి.సన్నిబాబు, కొమ్మ పృద్విరాజ్, కె.శరబన్న, తదితరులు పాల్గొన్నారు. నిరసన స్థలంలో పోలీసులు మోహరించారు.


పొదిలి (ప్రకాశం) : దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా... పొదిలి నగర పంచాయతీలో కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో పొదిలి పట్నంలో పారిశుధ్య పనులు నిలిచిపోయాయి. ప్రజలు చెత్తాచెదారాన్ని బయటపోయవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.

విస్సన్నపేట (కృష్ణా) : నేడు దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా ... విస్సన్నపేటలో సిఐటియు, సిపిఎం, ఎఐటియుసి అనుబంధాల సంఘాలు నిరసన చేపట్టాయి. ధరల పోటు, నిరుద్యోగం, ఎక్కడ చూసినా అభద్రత... ఒక్కటి కాదు అనేక సమస్యలు దేశ ప్రజల్ని చుట్టుముట్టాయి. ఎనిమిదేళ్లుగా మోడీ సర్కార్ తీవ్రతరం చేసిన అత్యంత ధనవంతులు, బడా కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు కొనసాగడం వల్లే సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ విధానాల్లో సమూల మార్పులు రావాలని నేతలు డిమాండ్ చేశారు.



వైజాగ్ సమ్మెలో నేతలు అరెస్ట్..
విశాఖ : ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకూడదంటూ ... అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖ మద్దిలపాలెం దగ్గర నిర్వహించిన రాస్తారోకో ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న సిపిఎం నాయకులు సిహెచ్.నర్సింగరావు, ఎం.జగ్గు నాయుడు, ఎఐటియుసి నాయకులు మన్మధరావు, ఇతర వామపక్ష కార్యకర్తలను బలవంతంగా అరెస్టులు చేసి ఎంవిపి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హుకుంపేటలో బంద్ కొనసాగుతోంది.

అనంతగిరి (విశాఖ) : అనంతగిరిలో బంద్ కొనసాగుతోంది. వరపుసంత బోసిపోయింది. బొర్రా గుహలు మూతపడ్డాయి.

తణుకు (పశ్చిమ గోదావరి) : మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ... సార్వత్రిక సమ్మెలో భాగంగా తణుకు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

గుమ్మలక్ష్మీపురం (విజయనగరం) : గుమ్మలక్ష్మీపురంలో నిర్వహించిన సమ్మెలో పెద్దఎత్తున కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురం నుండి ఎల్విన్ పేట కూడలి వరకు ర్యాలీ మానవహారం చేపట్టారు.



వంగర (శ్రీకాకుళం) : అఖిలభారత సమ్మెలో భాగంగా ... వంగర మండల కేంద్రంలో స్కీమ్ వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ కు వినతిపత్రాన్ని అందజేశారు.

ప్రజాశక్తి-మండపేట (తూర్పు గోదావరి) : కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా... మండపేటలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కే.కృష్ణవేణి మాట్లాడుతూ ... కార్మికులకు ఉరితాడుగా మారిన లేబర్ కోట్లను రద్దు చేయాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను రక్షించాలన్నారు. తదితర డిమాండ్ తో కూడిన వినతి పత్రం అధికారులకు అందజేశారు. స్థానిక సెంటర్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్, ఐఎన్‌టియుసి, అంగన్వాడి, ఆశా నాయకులు కొమరపు నరేంద్రకుమార్, బంగారు కొండ, గుమ్మడి అనిల్ కుమార్, వాదా ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.



















