Mar 15,2023 21:01

- ఏర్పాట్లను పరిశీలిస్తున్న జెసి సాయకాంత్‌వర్మ

ఒంటిమిట్ట : ఏప్రిల్‌ 5న జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఒంటిమిట్టలో రాములోరి కల్యాణోత్సవం నిర్వహణకు సంబంధించి కల్యాణోత్సవం వేదిక, శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై కడప మున్సిపల్‌ కమిషనర్‌ సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌తో కలసి క్షేత్రస్థాయిలో జెసి సాయికాంత్‌ వర్మ పరిశీలించి తగు సూచనలను జారీ చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ నుండి ఏప్రిల్‌ 9వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయన్నారు. ఏప్రిల్‌ 5వ తేదీన జరిగే సీతారాములవారి కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు ప్రముఖులు, అత్యంత ప్రముఖులు రావచ్చనే అంచనాతో ప్రణాళికాబద్దంగా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కళ్యాణోత్సవానికి సంబంధించి ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక, కనీస వసతులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. భద్రతా ఏర్పాట్లు, శానిటేషన్‌, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, తాగునీరు, భక్తులకు అన్నప్రసాదాలు, విద్యుత్‌ సరఫరా, ట్రాఫిక్‌ కంట్రోల్‌, ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు ఏర్పాటు, కంట్రోల్‌ రూం ఏర్పాటు, సీసీ కెమెరాలు, విద్యుత్‌, అగ్నిమాపక వాహనాలు, 108 వాహనాలు, అత్యవసర మందులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, తాత్కాలిక మెడికల్‌ క్యాంపులు, అక్కడక్కడ హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. అనంతరం జెసి సాయికాంత్‌ వర్మ కోదండరామస్వామి వారి ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించి స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు తీర్త, ప్రసాదాలు అందించి వారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆర్‌డిఒలు ధర్మచంద్రారెడ్డి, వెంకటరమణ, డ్వామా, డిఆర్‌డిఎ, మెప్మా పీడీలు యదుభూషన్‌రెడ్డి, ఆనంద్‌ నాయక్‌, రామమోహన్‌రెడ్డి, డిఎస్‌పి శివారెడ్డి, సమగ్ర శిక్ష ఎపిసి ప్రభాకర్‌ రెడ్డి, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నాగరాజు, డిపిఒ ప్రభాకర్‌రెడ్డి, జెడ్‌పి సిఇఒ సుధాకర్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఇ శ్రీనివాస్‌ రెడ్డి, డిటిసి మీరాప్రసాద్‌, ఆర్టీసీ ఆర్‌ఎం ప్రసాద్‌ రెడ్డి, సమాచార శాఖ ఎడి వేణుగోపాల్‌రెడ్డి, తితిదే సివిల్‌ విభాగం ఇఇ సుమతి, డిఇ రామమూర్తి, విద్యుత్తు విభాగం డిఇ చంద్రశేఖర్‌, డిప్యూటీ ఇఒ నటేష్‌ బాబు పాల్గొన్నారు.