Mar 09,2023 20:39

- పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న టిటిడి ఇఒ, కలెక్టర్‌ విజయరామరాజు

ఒంట్టిమిట్ట : టిటిడిలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమష్టి కృషి చేసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టిటిడి ఇఇఒ ఎవి.ధర్మారెడ్డి అధికారులను కోరారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, జిల్లా ఎస్‌పి అన్బురాజన్‌, జిల్లా యంత్రాంగంతో గురువారం ఒంటిమిట్టలో ఇఒ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఒ మాట్లాడుతూ గతంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుని శ్రీ సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. టిటిడి, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 16వ తేదీ మరోసారి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ నెల 30వ తేదీ శ్రీరామనవమితో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్‌ 3వ తేదీ హనుమంత వాహనం, ఏప్రిల్‌ 4వ తేదీ గరుడవాహనం, ఏప్రిల్‌ 5వ తేదీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఏప్రిల్‌ 6న రథోత్సవం, ఏప్రిల్‌ 8న చక్రస్నానం, ఏప్రిల్‌ 9న పుష్పయాగము జరుగుతాయని చెప్పారు. వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. భద్రత, పార్కింగ్‌, అన్నప్రసాదాల పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్‌ సరఫరా, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు, హెల్ప్‌ డెస్క్‌లు, సైన్‌ బోర్డులు, పారిశుధ్యం, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం విభాగాలు ఈ నెల 16వ తేదీలోపు తమ కార్యాచరణ ప్రణాళికలను అందించాలన్నారు. అంతకుముందు టిటిడి ఇఒ, వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌తో కలిసి శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టిటిడి జెఇఒ వీర బ్రహ్మం, వైఎస్‌ఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సాయి కాంత్‌వర్మ, డిఆర్‌ఒ గంగాధర్‌, ఎస్‌విబిసి సిఇఒ షణ్ముఖ కుమార్‌, టిటిడి సిఇ నాగేశ్వరరావు, కడప ఆర్‌డిఒ ధర్మచంద్రారెడ్డి, ఒఎస్‌డి రఘునాథ్‌, డ్వామా, డిఆర్‌డిఎ పీడీలు యదుభూషన్‌రెడ్డి, ఆనంద్‌ నాయక్‌, డిఎస్‌పి శివారెడ్డి, వ్యవసాయ శాఖ జెడి నాగేశ్వరరావు, సమగ్ర శిక్ష ఎపిసి ప్రభాకర్‌రెడ్డి, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నాగరాజు, సిపిఒ వెంకటరావు, డిపిఒ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ సిఇఒ సుధాకర్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఇ శ్రీనివాస్‌రెడ్డి, విద్యుత్‌ ఎస్‌ఇ మునిశంకరయ్య, డిటిసి మీరాప్రసాద్‌, ఆర్టీసీ ఆర్‌ఎం ప్రసాద్‌ రెడ్డి, టిటిడి పిఆర్‌ఒ రవి, సమాచార శాఖ ఎడి వేణుగోపాల్‌రెడ్డి, ప్రత్యేక ప్రతిభావంతుల శాఖ ఎడి కృష్ణకిషోర్‌, ఎపిఎంఐపి పీడీ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.